కులగణన జరిగితేనే దేశాభివృద్ధి సాధ్యం!
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:56 AM
దేశంలో సమగ్ర కులగణన నిర్వహించాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బీసీ వక్తలు డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి
బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభలో వక్తల డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో సమగ్ర కులగణన నిర్వహించాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బీసీ వక్తలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన జరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందని, అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. బెంగుళూరులో జాతీయ ఓబీసీ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, పీసీసీ చీఫ్ బీకే హరిప్రసాద్‌తో పాటు పలు రాష్ట్రాల మంత్రులు, ఓబీసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. బీసీలంతా ఐక్యతతో బలమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. బీసీల సర్వతోముఖాభివృద్ధి, సాధికారత సాధన కోసం రాజకీయ పార్టీలు విభేదాలు వీడి ఏకం కావాలని బికే హరిప్రసాద్ ఆకాంక్షించారు. జెన్‌జీ ఉద్యమ స్ఫూర్తితో ఈ బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.