Share News

నేటి నుంచి నర్మెట్టలో రైతు ఉత్సవాలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:52 AM

రాష్ట్ర సిగలో మరో కలికితురాయిగా నిలిచే నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ గురువారం నుంచి రైతు ఉత్సవాలు నిర్వహించనున్నామని వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

నేటి నుంచి నర్మెట్టలో రైతు ఉత్సవాలు

  • వివిధ విభాగాలకు చెందిన 150 స్టాళ్లు.. రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖికి వేదిక

  • 22న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

  • రూ.80 కోట్లతో నిర్మించే ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన

  • అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులు

  • మంత్రి తుమ్మల వెల్లడి... రైతు ఉత్సవాలకు స్పీకర్‌, చైర్మన్‌, ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం

  • కేంద్రం మద్దతు లేకున్నా మక్కలు కొంటామని వెల్లడి

హైదరాబాద్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సిగలో మరో కలికితురాయిగా నిలిచే నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ గురువారం నుంచి రైతు ఉత్సవాలు నిర్వహించనున్నామని వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వివిధ విభాగాలు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలల ప్రారంభంతో ఉగాది పర్వదినాన రైతు ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య శాఖలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఎఫ్‌పీవోలు, స్టార్టప్‌, ప్రైవేట్‌ సంస్థలు మొత్తం 150 స్టాళ్లు ఏర్పాటుచేసి, తమ ఆధునిక సాంకేతికతలు, సేవలు, అవకాశాలను ప్రదర్శించి రైతులకు పరిచయం చేస్తాయని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, వివేక్‌ వెంకటస్వామితో కలిసి సమావేశం నిర్వహించారు. రైతు ఉత్సవాలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయన్నారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు, నిపుణులతో రైతులు ముఖాముఖి చర్చించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య శాఖల శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల ముగింపు రోజు నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుందని చెప్పారు. ఫ్యాక్టరీ దగ్గర రూ.80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అదే రోజు సీఎం రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, ఆ వేదిక నుంచే రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని చెప్పారు. నర్మెట్ట ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్‌ రైతుల సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి వారి ఆదాయం పెరగడానికి దోహదపడుతుందని చెప్పారు. కేంద్రం నుంచి మద్దతు లేకపోయినా గత ఖరీఫ్‌లో మాదిరిగానే ఈ యాసంగిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.


రైతు ఉత్సవాలకు రండి!

నర్మెట్టలో జరిగే రైతు ఉత్సవాల్లో పాల్గొనాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను మంత్రి తుమ్మల కోరారు. బుధవారం స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మండలి చైర్మన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానాలు అందజేసినట్టు తుమ్మల మీడియాకు తెలిపారు. రైతు ఉత్సవాలకు హాజరుకావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావును కూడా తుమ్మల ఆహ్వానించారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ చాంబర్‌కు వెళ్లిన తుమ్మల... కేటీఆర్‌, హరీశ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు.

మట్టి పాత్రలను బహూకరించిన మంత్రి పొన్నం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీలో శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉగాది కిట్‌ పేరుతో మట్టి పాత్రలు బహూకరించారు. ‘మట్టి పాత్రలు వాడండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. కులవృత్తులను ప్రోత్సహించండి’ అని కోరారు. ఆ కిట్‌లో పండుగకు ఉపయోగపడే మట్టి కుండలు, పాత్రలు, గ్లాసులు, జగ్గులతో పాటుగా ఉగాది పచ్చడి తయారీకి అవసరమయ్యే మామిడి, వేపపువ్వు, చింతపండు వంటివీ ఉంచారు.

Updated Date - Mar 19 , 2026 | 03:52 AM