సిరుల గలగెలలు!
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:41 AM
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్థాపించిన కర్మాగారం.. ఆయిల్ పామ్ గెలలను శుద్ధిచేస్తూ, సీపీవో (క్రూడ్ పామాయిల్) ఎగుమతి చేస్తూ.. రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది.
ఆయిల్‌పామ్ రైతులకు అందుబాటులోకి నర్మెట్ట కర్మాగారం
28 వేల టన్నుల గెలల ప్రాసెసింగ్
టన్నుకు రూ.23852చొప్పున చెల్లింపు
3 రోజులకోసారి రైతులకు నగదు బదిలీ
రాష్ట్రంలో మరో ఏడు కర్మాగారాలు, సిద్దిపేటలో రిఫైనరీ యూనిట్
నర్మెట్ట నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్థాపించిన కర్మాగారం.. ఆయిల్ పామ్ గెలలను శుద్ధిచేస్తూ, సీపీవో (క్రూడ్ పామాయిల్) ఎగుమతి చేస్తూ.. రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. ట్రయల్‌రన్‌లో 4 వేల టన్నులు, ప్రారంభోత్సవం చేసిన తర్వాత 24 వేల టన్నుల గెలలను వడవడిగా శుద్ధిచేసి రికార్డులు సృష్టిస్తోంది. టన్నుకు రూ.23,852 చొప్పున ధర చెల్లిస్తూ ఉత్తర తెలంగాణలో ఆయిల్ ఫెడ్ పరిధిలోని పది జిల్లాల రైతులకు కాసుల పంట పండిస్తుండటం గమనార్హం. వారానికి రెండుసార్లు రైతులకు చెల్లింపులు చేస్తూ, ఆయిల్‌పామ్ గెలలకు మార్కెట్ భద్రత కల్పిస్తుండటంతో రైతులు సాగువైపు ఆకర్షితులవుతున్నారు.్ఝఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో 2006లో టన్నుల సామర్థ్యంతో, 2016లో అప్పారావుపేటలో 90 టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వ సహకార నూనెగింజల ఉత్పత్తి సంస్థ(ఆయిల్ ఫెడ్) రెండు కర్మాగారాలు ప్రారంభించింది. ఆతర్వాత 2026లో సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో 30 టన్నుల నుంచి 120 టన్నుల సామర్థ్యం కలిగిన పామాయిల్ కర్మాగారాన్ని అందుబాటులోకి తెచ్చింది. మూడు కర్మాగారాల్లో కలిపి ప్రస్తుతం గంటకు 150టన్నుల పామాయిల్ గెలలు శుద్ధి అవుతూ క్రూడ్ పామాయుల్(సీపీవో) ఉత్పత్తి చేస్తున్నాయి. నర్మెట్ట యూనిట్‌ను మరింత విస్తరించి 120 టన్నుల సామర్థ్యానికి తీసుకెళ్తే.. ఉత్పత్తి సామర్థ్యం గంటకు 240 యూనిట్లకు పెరుగుతుంది. రాష్ట్రంలో పామాయుల్ సాగువిస్తీర్ణం 2,91,045 ఎకరాలకు చేరుకోగా 93,514 ఎకరాల్లో గెలలు ఉత్పత్తి అవుతున్నాయి. 2.91లక్షల ఎకాల్లో ఆయిల్‌ఫెడ్ విస్తీర్ణం 1.73లక్షల ఎకరాలు కాగా... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.13లక్షల విస్తీర్ణం ఉంది. మిగిలిన 60వేల ఎకరాల సాగు విస్తీర్ణం సిద్దిపేట, భువనగిరి, జనగామ, మహబూబాబాద్, గద్వా ల, నారాయణపేట, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట, హన్మకొండ జిల్లాల్లో ఉండడం గమనార్హం. ఈ 60 వేల ఎకరాల్లో 11వేల ఎకరాల్లో గెలలు ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన 13 జిల్లాలు ప్రైవేటు కంపెనీలకు కేటాయించారు.

ఈ ఏడాది లక్ష టన్నుల లక్ష్యం
నర్మెట్ట కర్మాగారాన్ని గత మార్చి 22న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. గంటకు 30 టన్నుల పామాయుల్ గెలలు శుద్ధిచేస్తున్న ఈ కర్మాగారంలో ఇప్పటివరకు 28 వేల టన్నుల గెలలను శుద్ధిచేసి క్రూడ్ పామాయుల్ ఉత్పత్తిచేశారు. ఈ ఏడాది అక్టోబరు 31 నాటికి లక్ష టన్నుల గెలలు శుద్ధిచేయాలని ఆయిల్‌ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యాక్టరీ సామర్థ్యం రోజుకు 600 టన్నులు కాగా... ఆ మేరకు గెలలు వస్తున్నాయి. రైతులు నేరుగా ఫ్యాక్టరీకి గెలలు తీసుకొచ్చి విక్రయించే వెసులుబాటు కల్పించారు. ఇందుకు దూరాన్నిబట్టి రూ. 370 నుంచి రూ.900 వరకు రవాణా చార్జీలూ చెల్లిస్తుండటంతో రైతులు ఉత్సాహంగా గెలలు తీసుకొస్తున్నారు. చేర్యాల, ఎర్రవెల్లి, పాల్వంచ, ముదిగొండ, సత్తుపల్లి, కురవి, బీచుపల్లి,మరికల్, పాలకుర్తి, యాదాద్రి, కరీంనగర్ రూరల్, సూర్యాపేట, హనుమకొండ, వైరాలో గెలల సేకరణ కేంద్రాలు (కలెక్షన్ సెంటర్లు)ఏర్పాటుచేశారు. రైతులు తోటల నుంచి సెంటర్లకు గెలలు తీసుకొస్తే... అక్కడ నుంచి కాంట్రాక్టర్లు కర్మాగారాలకు తరలిస్తున్నారు. దీంతో రైతులకు మార్కెట్ భద్రత ఏర్పడింది.
టన్నుకు 23,852చొప్పున చెల్లింపులు
టన్ను పామాయిల్ గెలలకు ప్రస్తుతం రూ.23,852 చొప్పున ధర పలుకుతోంది. తొలి పంటగా రైతులకు ఎకరానికి 4టన్నుల గెలలు ఉత్పత్తి అవుతున్నాయి. రూ.95వేల వరకు ఆదాయం వస్తోంది. చెట్ల వయస్సు పెరుగుతున్న కొద్దీ గరిష్ఠంగా సగటున 10 టన్నుల గెలలు ఉత్పత్తి అవుతాయని ఆయిల్‌ఫెడ్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. అప్పుడు ఎకరానికి రూ.2.30లక్షల ఆదాయం వస్తుందని, రూ.30వేలు ఖర్చులు పోతే... రూ.2లక్షల వరకు రైతుకు మిగులుబాటు ఉంటుందని తెలిపారు. కాగా ఆయిల్‌పామ్ రైతులకు మూడు రోజుల వ్యవధిలోనే గెలల డబ్బులు అందుతున్నాయి. నెలకు రెండుసార్ల చొప్పున ఏడాదికి 24 సార్లు గెలలు కోసుకునే అవకాశం ఉంది. 150- 160 రోజుల్లో పంటచేతికొస్తుంది.
మరో ఏడు ఫ్యాక్టరీలు... రిఫైనరీ యూనిట్
ప్రస్తుతం రాష్ట్రంలో మూడు(నర్మెట్ల, అశ్వరావుపేట, అప్పారావుపేట) పామాయిల్ కర్మాగారాలున్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరగనుంది. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, గద్వాల జిల్లా బీచుపల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్‌పల్లి, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, నల్లగొండ జిల్లా యాచారంలో కర్మాగారాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ కంపెనీల 2 యూనిట్లు వచ్చే ఆగస్టులో అందుబాటులోకి రానున్నాయి. మరో 5యూనిట్లు 2027లో అందుబాటులోకొచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి క్రూడ్ పామాయిల్ (సీపీవో) ఉత్పత్తి చేస్తున్నారు. నర్మెట్టలో ఇప్పటివరకు 5,260 టన్నుల క్రూడ్ పామాయుల్ ఉత్పత్తిచేసి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కంపెనీలకు విక్రయిస్తున్నారు. సిద్దిపేటలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.40కోట్లతో రిఫైనరీ యూనిట్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. 2027లోగా అందుబాటులోకి తెస్తాం. గెలల శుద్ధి ప్రక్రియలో 55 శాతం వ్యర్థ ద్రావణం ఉత్పత్తి అవుతోంది. దీంతో సౌందర్య సాధనాలకు వాడే కర్నెల్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు. బయోమా్‌సను పంటలకు ఎరువుగా రైతు లకు విక్రయించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 4మెగావాట్ల సామర్థ్యంతో బయో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేశారు. కర్మాగార విద్యుత్ అవసరాలు తీర్చటంతోపాటు 2,500మందికి ఉపాధి లభిస్తోంది.

‘నర్మెట్ట’ ఫైలుపైనే తొలి సంతకం
వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... నా తొలి సంతకం నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపన ఫైలు పైనే చేశా. ఈరోజు విజయవంతంగా ఫ్యాక్టరీ నడుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 30 టన్నుల సామర్థ్యంతో ప్రస్తుతం నడుస్తోంది. 120 టన్నుల సామర్థ్యానికి విస్తరిస్తాం. ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీల్లో మూడు రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం. రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ఇంకా ముందుకురావాలి. వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలి. ఆయిల్‌పామ్‌కు మార్కెటింగ్ సమస్యలేదు. ఆదాయం ఎక్కువగా వస్తుంది. మూడేళ్లు అంతర పంటలూ వేసుకోవచ్చు. ఎకరాకు రూ.50వేల దాకా సబ్సిడీ ఇస్తున్నాం.
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పెరగనున్న విజయ బ్రాండ్ మార్కెట్ సేల్స్
వంటనూనెల వినియోగంలో పామాయుల్ వాటా 59 శాతం ఉంది. రాష్ట్రంలో పామాయిల్ రిఫైనరీ యూనిట్ ప్రారంభమైతే ప్రతి నెల 50 లక్షల లీటర్ల పామాయిల్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల టన్నుల విజయ పామాయిల్ విక్రయాలు జరుగుతున్నాయి. దీనిని రెట్టింపు చేయాలని ఆయిల్‌ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. 20 వేల నుంచి 30 వేల టన్నులకు విజయ వంటనూనెల విక్రయాలు పెరిగితే విదేశీ దిగుమతులు గణనీయంగా తగ్గిపోతాయి. ఎగుమతి, దిగుమతి, రవాణా చార్జీలు తగ్గితే ఖర్చులు తగ్గుతాయి. ఇతర కంపెనీల కంటే కొంత ధర తగ్గించి విక్రయిస్తే విజయ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని ఆయిల్‌ఫెడ్ అధికారులు భావిస్తున్నారు.