Share News

నా ప్రయాణం.. తెలంగాణ ప్రవాసీయుడి తెలుగు పుస్తకం

ABN , Publish Date - May 04 , 2026 | 04:19 AM

పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వచ్చి రేయింబవళ్లు శ్రమిస్తూ వీలుచిక్కినప్పుడల్లా రచనలు చేసే తెలుగు ప్రవాసీ రచయితల్లో నారిదడిగే నరేష్‌ ఒకరు.

నా ప్రయాణం.. తెలంగాణ ప్రవాసీయుడి తెలుగు పుస్తకం

  • మస్కట్‌లో ఆవిష్కరించిన భారత రాయబారి

  • (ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వచ్చి రేయింబవళ్లు శ్రమిస్తూ వీలుచిక్కినప్పుడల్లా రచనలు చేసే తెలుగు ప్రవాసీ రచయితల్లో నారిదడిగే నరేష్‌ ఒకరు. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం మెండోరా గ్రామానికి చెందిన నరేష్‌ ప్రస్తుతం ఒమాన్‌ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికునిగా పని చేస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా ఎడారి దేశంలోనే ఉంటున్న నరేష్‌.. తన స్వీయ అనుభవాలను వివరిస్తూ రాసిన కథనాలను ‘నా ప్రయాణం’ అనే సంపుటిగా వెలువరించారు. మస్కట్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి జీవీ శ్రీనివాస్‌ ఆ పుస్తకాన్ని అవిష్కరించారు. పేదరికం వల్ల ఇంటర్‌ విద్యను మధ్యలోనే ఆపేసి యుక్త వయస్సులో ఎడారి బాట పట్టిన నరేష్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘‘ ఉండడానికి మనస్సు ఒప్పుకోవడం లేదు. తిరిగి వెళ్లడానికి దైర్యం చాలదు.. కుటుంబ బాధ్యతలు గుండెను రాయిగా మార్చడంతో గత్యంతరం లేక ఎడారుల్లో బతుకుతున్న తీరు’’కు ప్రతిరూపమే తన రచనలని అంటున్నారు. తన ఇద్దరు చిన్నారులు గుర్తుకు వస్తే అన్నం ముద్ద దిగదని, కన్నీటి చెమ్మలు ఆగవని, అర్ధరాత్రి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచి కన్నీరు పెట్టుకొన్న అనుభవాలే తన పుస్తకమని నరేష్‌ అన్నారు. ఒక ప్రవాసీ సగటు కార్మికుడిగా తన అనుభవాలతో పాటు తెలుగు భాష సాహిత్యంపై మక్కువ, అభిరుచి కూడా తనను రచనల దిశగా ప్రోత్సహించిందని నరేష్‌ తెలిపారు. మానవీయ కోణం, న్యాయసూత్రంగా రచనలు చేసిన కాళోజి, అలిశెట్టి ప్రభాకర్‌లు తనకు నచ్చిన రచయితలని నరేష్‌ వెల్లడించారు.

Updated Date - May 04 , 2026 | 04:19 AM