తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో..నృసింహ పాదాల ప్రతిష్ఠాపన
ABN , Publish Date - May 02 , 2026 | 05:18 AM
తిరుమల క్షేత్రం తరహాలోనే.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో, కొండపైకి భక్తులు మెట్లమార్గంలో ప్రవేశించే వైకుంఠద్వారం కూడలిలో నృసింహుడి పాదాలను ప్రతిష్ఠించారు.
2.5 అడుగుల వెడల్పు.. 2 అడుగుల ఎత్తు
యాదాద్రి, మే 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల క్షేత్రం తరహాలోనే.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో, కొండపైకి భక్తులు మెట్లమార్గంలో ప్రవేశించే వైకుంఠద్వారం కూడలిలో నృసింహుడి పాదాలను ప్రతిష్ఠించారు. శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రం (స్వాతి) సందర్భంగా ఆ పాదాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వామి పాదాల వద్ద నిర్వహించిన తొలి అభిషేక పూజల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భవానీశంకర్ పాల్గొన్నారు. రెండున్నర అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తు ఉన్న ఈ పాదాలను కృష్ణరాతి శిలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులు కొండదిగువన వైకుంఠద్వారం వద్దనే ఈ పాదాలకు నమస్కరించుకుని, కొండపైకి చేరుకునేలా ఏర్పాటుచేశారు. కాగా.. ఆలయ ఉద్ఘాట న తర్వాత మండల దీక్షల స్థానంలో స్వామివారి గిరిప్రదక్షిణలు సామూహికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు స్వామివారి తిరునక్షత్రం(స్వాతి) రోజున 30 వేల మందికి పైగా భక్తులు నృసింహనామ స్మరణలతో గిరిప్రదక్షిణల్లో పాల్గొంటున్నారు. అయితే శుక్రవారం (మే 1) నుంచి నిత్యం గిరిప్రదక్షిణలు చేయొచ్చని ఈవో భవానీశంకర్ తెలిపారు. వైకుంఠద్వారం వద్ద స్వామి పాదాలకు నమస్కరించుకుని ప్రారంభించి, ఇక్కడే ప్రదక్షిణ ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.