నరహరి కేసులో కీలక మలుపు!
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:16 AM
గత నెల్లో అక్రమార్జన కేసులో ఏసీబీకి చిక్కిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసు మరో మలుపు తిరిగింది.
ఓ సహకార బ్యాంకులో రూ.3.5 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్.. నెలకు రూ.3.6 లక్షల వడ్డీ
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గత నెల్లో అక్రమార్జన కేసులో ఏసీబీకి చిక్కిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసు మరో మలుపు తిరిగింది. నరహరి అరెస్టు, రెండు రోజుల కస్టడీ తర్వాత దొరికిన కీలక ఆధారాల మేరకు ఓ సహకార పరపతి సంఘం ఏసీబీ స్కానర్‌లోకి వచ్చింది. నరహరిని అరెస్టు చేసిన సమయంలో ఆయన ఇంట్లో రూ.5.04 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.3.5 కోట్లు ఒక సహకార పరపతి సంఘంలో, మిగతా మొత్తాన్ని ఓ జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అయితే 3.5 కోట్ల డిపాజిట్‌కు సంబంధించి ఆ సహకార సంఘం ప్రతి నెలా రూ.3.6 లక్షల వడ్డీని నరహరికి చెల్లించినట్లు తేల్చారు. అయితే రూ.3.5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించి ఆన్‌లైన్, బ్యాంకింగ్ లావాదేవీల్లో ఏ వివరాలు లేకపోవడంతో నరహరి నగదు రూపంలోనే సహకార బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే ఆ సహకార సంఘం నిర్వాహకులు, సభ్యుల వివరాలు, డిపాజిటర్ల సమాచారం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. నరహరి కేసులో గుర్తించిన అనుమానాస్పద అంశాలను ఇప్పటికే ఐటీ విభాగానికి ఏసీబీ అందజేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏసీబీ కస్టడీలో నరహరిని ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రశ్నించగా ఆ సహకార సంఘం సీనియర్ సభ్యుడి సూచనతో అందులో పెట్టానని చెప్పినట్లు సమాచారం.