నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:12 AM
ప్రముఖ తెలుగు కవి నందిని సిధారెడ్డికి 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో...
న్యూఢిల్లీ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలుగు కవి నందిని సిధారెడ్డికి 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్.. సిధారెడ్డికి ఈ పురస్కారం అందజేశారు. ఈ పురస్కారంలో భాగంగా రూ.లక్షతో పాటు తామ్రపత్రం బహూకరించారు. సిధారెడ్డి ‘అనిమేష’ కవితా సంకలనానికి ఈ పురస్కారం అందిస్తున్నట్లు ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ అయిన సిధారెడ్డి ఇప్పటి వరకు 20 పుస్తకాలు రచించారు. దాశరథి అవార్డుతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. అనిమేషలో కొవిడ్ విపత్తు సమయంలో మనిషి అనుభవించిన వేదనను కవితాత్మకంగా పొందుపరిచారని, ప్రకృతికి, మనిషికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో కవిత్వం రాశారని ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. ఒక తాత్విక దృక్పథంతో రాసిన ఈ కవిత కరోనా విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి గొప్ప నివాళి వంటిదని, తెలుగు కవిత్వంలో ఇది ఉత్తమ రచనగా నిలుస్తుందని కొనియాడారు.