నందినీ సిధారెడ్డికికేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:07 AM
ప్రముఖ తెలంగాణ కవి, తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందినీ సిధారెడ్డికి 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం .....
ఈ పురస్కారానికి ‘అనిమేష’ కవితా సంకలనం ఎంపిక
సిధారెడ్డితోపాటు 24 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అవార్డులు
న్యూఢిల్లీ/ హైదరాబాద్ / హైదరాబాద్ సిటీ/ కొండపాక, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలంగాణ కవి, తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందినీ సిధారెడ్డికి 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కరోనా సమయంలో సమాజంలో నెలకొన్న స్థితిగతులు, ప్రజల దుస్థితి, ఆవేదన, మానవీయ కోణాలను వ్యక్తీకరిస్తూ ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంకలనాన్ని ఈ పురస్కారం వరించింది. ‘నాగేటి సాలల్ల నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ’ అని ఆలాపించిన ప్రజా కవి నందిని సిధారెడ్డితోపాటు 24 భాషల రచయితలకు పురస్కారాలు ఇవ్వాలని గతేడాది డిసెంబరులో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. డజన్‌కు పైగా కవితాసంపుటాలు, పలు గేయాలు, సాహితీ గ్రంథాలను రచించిన సిధారెడ్డి.. సిద్దిపేట జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించారు. ఆధునిక కవిత్వంలో వాస్తవికత- అధివాస్తవికత అన్న అంశంపై ఉస్మానియా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా రిటైరయ్యారు. భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత కవితా సంకలనాలు కవిగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సిధారెడ్డికి ఈ నెల 31న జరిగే కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య ఉత్సవాల్లో రూ. లక్ష నగదు, తామ్ర పతాకం బహూకరిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి సిధారెడ్డి కవితా సంకలనం ఎంపిక చేసిన న్యాయనిర్ణేతల బృందంలో ప్రముఖ రచయితలు మధురాంతకం నరేంద్ర, కోయి కోటేశ్వరరావు, ఎన్ గోపీ ఉన్నారు. కేంద్ర సాహితీ పురస్కారానికి ఎంపికైన సిధారెడ్డికి, తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చెర్మన్ జూలూరీ గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి 2025 సంవత్సరానికి 8 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 కథా సంకలనాలు, 2 వ్యాస సంపుటాలు, ఒక సాహితీ విమర్శ, ఒక జీవిత చరిత్ర, 2 స్మారక రచనలకు అవార్డులు లభించాయి. ఈ అవార్డుకు ఎంపికైన ప్రముఖ రచయితల్లో బెంగాలీ రచయిత ప్రసూన్ బందోపాధ్యాయ, ఆంగ్ల రచయిత- విదేశాంగ శాఖ మాజీ అధికారి నవతేజ్ సర్నా, హిందీ రచయిత్రి మమతా కాలియా, మలయాళీ రచయిత ఎన్ ప్రభాకరన్, తమిళ రచయిత తమిళ సెల్వన్ ఉన్నారు.