పార్‌కింగ్ కాంప్లెక్స్!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:20 AM
షాపింగ్ చేయడానికో, ఆస్పత్రికనో, మరేదైనా పని కోసమో కారుతో రోడ్డెక్కితే హైదరాబాద్‌లో పార్కింగ్‌కు స్థలం దొరకడమే బంగారమవుతోంది!
నాంపల్లిలో బహుళ అంతస్తుల పార్కింగ్ భవనం
ఇంటర్ బోర్డు కూడలిలో విదేశీ సాంకేతికతో నిర్మాణం
2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో మొత్తం 15 అంతస్తులు
పది అంతస్థులు పార్కింగ్‌కే.. 250 కార్లు, 200 బైక్‌ల సామర్థ్యం
ప్యాలిస్ సర్కిల్‌లో నిలిపితే చాలు.. పార్కింగ్ చోటుకు కారు
కారుకైతే గంటకు రూ.35, బైక్‌కు రూ.15 చొప్పున ఫీజు
హైదరాబాద్ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): షాపింగ్ చేయడానికో, ఆస్పత్రికనో, మరేదైనా పని కోసమో కారుతో రోడ్డెక్కితే హైదరాబాద్‌లో పార్కింగ్‌కు స్థలం దొరకడమే బంగారమవుతోంది! రోడ్డు పక్కన ఆపేసి వెళితే ట్రాఫిక్ కానిస్టేబుల్ కెమెరాతో ‘క్లిక్’మనిపిస్తే ఫైన్ రూపంలో వాత పడుతోంది! ఇలా నగర ప్రయాణికుడు ఉక్కిరిబిక్కిరవుతున్న స్థితిలో నాంపల్లి పరిధిలో పార్కింగ్ కష్టాలు తీరేలా ఓ అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకొచ్చేసింది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్థుల వ్యవస్థ ఇంటర్మీడియట్ బోర్డు కూడలిలో సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో రూ.102 కోట్లు వెచ్చించి, 2వేల చదరపు గజాల విస్తీర్ణంలో 15 అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఇందులో పది అంతస్థులను పార్కింగ్ కోసమే కేటాయించారు. 250 కార్లు, 200 బైక్‌లు పడతాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఈ భవనం పనులను 2018లో శ్రీకారం చుట్టారు. ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తిచేయాకున్నా కొవిడ్, సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, దీన్ని ప్రపంచ శ్రేణి ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. పీపీపీ విధానంలో ‘నోవమ్‘ సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ‘ప్యాలిస్‘ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్, ఏఐ ఆధారిత సౌకర్యం, పజిల్ పార్కింగ్ సిస్టమ్‌గా నిర్మించారు. ఈ అధునాతన పార్కింగ్ వ్యవస్థ దేశంలోనే మొదటిది. భవనంలోని మిగతా 5 అంతస్తులను వాణిజ్య కార్యకలాపాల కోసం కేటాయించారు. 11వ అంతస్తులో నగర వీక్షణకు గ్యాలరీ ఏర్పాటు చేశారు. రెండు అంతస్థులను థియేటర్లకు కేటాయించారు.
పార్కింగ్ ప్రత్యేకతలు
సెన్సార్ల సాయంతో మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటెడ్ పజిల్‌తో పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ టికెట్ తీసుకున్న వెంటనే సెన్సార్ గేట్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి. తర్వాత కారును తీసుకెళ్లి గుండ్రంగా ఉండే ప్యాలిస్ టేబుల్‌పై వదిలేసి, ఇంజిన్ ఆఫ్ చేసి హ్యాండిల్ లాక్ చేయగానే.. రోబోటిక్ ట్రాన్స్‌పోర్టర్ దానిని తీసుకెళ్లి ఆటోమేటెడ్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేస్తుంది.
ఇది ఎస్‌యూవీలు, సెడాన్‌లు, చిన్న కార్లను వాటి పరిమాణం ఆధారంగా స్వయంచాలకంగా వేరు చేసి, వాటికి కేటాయించిన అంతస్తుల్లో పార్క్ చేస్తుంది. వాహనాలు లోపలికి, బయటకు వచ్చే టర్మినల్స్ విశాలంగా ఉండి ఏఐ ఆధారితంగా స్మార్ట్‌గా పనిచేస్తాయి.
వృద్థులు, మహిళలు, వికలాంగులకు అనుకూలంగా ఉండే విధంగా ఫ్లాట్ టెర్మినల్స్ కూడా నిర్మించారు. వాహనాలను ఏ విధంగానైనా విడిచి పెట్టి వెళ్లినా, 360 డిగ్రీలు తిరిగే ప్యాలిస్ టేబుల్ స్వయంగా దానిని సరైన విధానంలో పెట్టి పార్కింగ్ చేస్తుంది. ఈ పార్కింగ్ ప్రక్రియ వినియోగదారుడికి ఒక వినూత్నమైన అనుభవాన్ని ఇస్తుంది.
ప్రవేశద్వారంలో క్యూఆర్ కోడ్ ఉన్న టికెట్ (స్మార్ట్ కార్డ్) సూచనలతో ఇన్/అవుట్ టెర్మినల్‌కు చేరుకున్న వెంటనే కార్డును స్వైప్ చేస్తే టెర్మినల్ గేట్ తెరుచుకుంటుంది. టెర్మినల్ బయట కార్డును స్వైప్ చేయగానే పార్కింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సిస్టమ్ తనంతట తానే కారును స్కాన్ చేసి ఎస్‌యూవీ/సెడాన్‌గా వర్గీకరించి, తగిన అంతస్తులో పార్క్ చేస్తుంది.
వినియోగదారుడు ఫీజు చెల్లించే కౌంటర్‌లో రుసుము ఇచ్చిన తర్వాత, సూచించిన ఐ/ఓ టెర్మినల్ వద్దకు వెళ్లి కార్డును స్వైప్ చేయగానే, పార్కింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి వాహనం వినియోగదారుని వద్దకు చేరుకుంటుంది. ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ సౌకర్యంలో రోబోటిక్ ట్రాన్స్‌పోర్టర్ సేవలు కీలకమైనవి. ఇవి వాహనాలను లిఫ్ట్‌లోకి తరలించి ఖాళీగా ఉన్న ప్రదేశంలో పార్కింగ్ చేస్తాయి.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో మెకానికల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. నాంపల్లిలో నిర్మించిన కాంప్లెక్స్ వాటికి భిన్నంగా ఉంది. యజమాని/డ్రైవర్ లేకుండానే సులభంగా వాహనాలను పార్కింగ్ జరుగుతోంది
ఇందులో 5 నుంచి 10వ అంతస్తు వరకు కార్ల పార్కింగ్ ఉంటుందని, బీ-1లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. కార్లకు మాత్రమే ఆటోమేటెడ్ సదుపాయం ఉందని, ద్విచక్ర వాహనాలను ఎవరికి వారుగా పార్కింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
కారుకు గంటకు రూ.35, బైక్‌కు రూ.15 చొప్పున ఫీజు నిర్ణయించారు.