ముఖ్య అతిథిగా సుప్రీం సీజే వద్దు
ABN , Publish Date - Aug 10 , 2026 | 06:05 AM
త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ..
విద్యార్థులపై దాడి వీడియోలు చూసే తీరిక ఆయనకు లేదు
స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించొద్దంటూ..
నల్సార్ వీసీ, రిజిస్ట్రార్‌లకు 450 మంది విద్యార్థుల లేఖ
ఇప్పటికే సీజేఐని చీఫ్ గెస్ట్‌గా పిలిచి స్నాతకోత్సవాన్ని
వాయిదా వేసుకున్న టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
హైదరాబాద్, శామీర్‌పేట, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ 450 మంది విద్యార్థులు ఆ వర్సిటీ ఉపకులపతికి, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని.. ముఖ్య అతిథి ఎంపిక ఇంకా చర్చల దశలోనే ఉందనే విషయం తమకు తెలుసని.. అందుకే అధికారిక నిర్ణయం తీసుకునే ముందే తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ లేఖ రాస్తునట్టు అందులో పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ విచారణలో.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యవహరించిన తీరుపై తమకు అభ్యంతరాలున్నాయని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వచ్చాయని, పలువురు నిరసనకారులు గాయపడినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారని.. కానీ, జూలై 23న జరిగిన విచారణ సందర్భంగా.. విద్యార్థులపై పోలీసుల దాడులకు సంబంధించి వీడియోలు చూసేందుకూ ఆయన నిరాకరించారని, అందుకు తనకు సమయం లేదని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.
నిరసనలకు గల కారణాలను వివరించడానికి న్యాయవాది ప్రయత్నించినప్పుడు ఆయన మాటలను సీజేఐ మధ్యలోనే అడ్డుకుని ‘థాంక్యూ వెరీమచ్’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. న్యాయవిద్యార్థులుగా.. మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టాలు అందుకోబోతున్న బ్యాచ్‌గా తమ ఆందోళన పరిమితమైనదేనని.. రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం, సమస్యల పట్ల వివేకంతో స్పందించడం వంటివి వర్సిటీ విలువలని.. వర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో ఆ విలువలు ప్రతిబింబించేలా స్నాతకోత్సవం ఉండాలని అభిప్రాయపడ్డారు. నిరసన తెలుపుతున్న పౌరులపై పోలీసుల క్రూరత్వం గురించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తోసిపుచ్చినట్టుగా పేర్కొంటున్న ఒక వ్యక్తి నుంచి తమ డిగ్రీలను స్వీకరించడం.. నల్సార్‌లో తాము నేర్చుకున్న విలువలకు విరుద్ధంగా ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాబట్టి, ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథి ఎంపిక విషయాన్ని వర్సిటీ తీవ్రంగా పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారంలోగా తమ వినతిపై స్పందించాలని అభ్యర్థించారు.
ఆగస్టు 2న జరగాల్సింది..
సీజేఐ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) 86వ స్నాతకోత్సవం వాయిదా పడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 2న జరగాల్సిన ఆ కార్యక్రమాన్ని.. ‘‘అనుకోని పరిస్థితుల’’ కారణంగా వాయిదా వేస్తున్నట్లు టిస్ చివరి నిమిషంలో ప్రకటించింది. కారణాలను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.