Share News

వాళ్లు లాయర్లుగా వద్దు!

ABN , Publish Date - Aug 14 , 2026 | 07:13 AM

నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ను ఆహ్వానించవద్దని పేర్కొంటూ ఆ వర్సిటీ విద్యార్థులు వీసీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. వారిపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తీవ్ర చర్యలు చేపట్టింది.

వాళ్లు లాయర్లుగా వద్దు!

  • నల్సార్‌ 2026 బ్యాచ్‌ విద్యార్థులపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కొరడా

  • వారిని నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లకు ఆదేశం

  • స్నాతకోత్సవానికి సీజేఐని ఆహ్వానించవద్దన్న విద్యార్థుల లేఖతో చర్య

  • తీవ్ర వ్యతిరేకత.. నిరసన ప్రాథమిక హక్కు.. అడ్డుకోవటానికి మీరెవరు?

  • బెదిరించే రోజులు పోయాయి: సీజేపీ.. ఖండించిన సుప్రీం బార్‌

  • వెనక్కి తగ్గిన బీసీఐ.. ఉత్తర్వుల ఉపసంహరణ

  • వీసీ నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్‌, శామీర్‌పేట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ను ఆహ్వానించవద్దని పేర్కొంటూ ఆ వర్సిటీ విద్యార్థులు వీసీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. వారిపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తీవ్ర చర్యలు చేపట్టింది. 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్‌ న్యాయశాస్త్ర పట్టభద్రులను ఎవరినీ లాయర్లుగా నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గంటల వ్యవధిలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో బీసీఐ వెనక్కి తగ్గింది. తాను జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. విద్యార్థులు అమాయకులని.. వారిని కొందరు నల్సార్‌ అధ్యాపకులు, బయటివ్యక్తులు రెచ్చగొట్టారని, వర్సిటీ వీసీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 2026 బ్యాచ్‌లో లా డిగ్రీని పూర్తి చేసుకున్న విద్యార్థులకు నల్సార్‌లో స్నాతకోత్సవం నిర్వహించటానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. ఇటీవల వర్సిటీ రిజిస్ట్రార్‌కు, వీసీకి 450 మంది విద్యార్థులు ఒక లేఖ రాసినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ముఖ్య అతిథిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ను పిలవాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోందని, ఆయనను ఆహ్వానించవద్దని ఆ లేఖలో విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.


గత నెల ఢిల్లీలో విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ సందర్భంగా వారి మీద పోలీసులు జరిపిన క్రూరమైన లాఠీచార్జీ, బలప్రయోగం తాలూకు వీడియోలను చూడటానికి తనకు సమయం లేదని చెప్పిన జస్టిస్‌ సూర్యకాంత్‌ చేతుల మీదుగా తాము పట్టాలు అందుకోబోమని, అది వర్సిటీ తమకు నేర్పిన విలువలకు విరుద్ధమని వారు స్పష్టం చేశారు. ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’ కూడా జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిన స్నాతకోత్సవాన్ని అంతకుముందు వాయిదా వేసుకుంది. దీనికి కూడా ఆ సంస్థ విద్యార్థుల వ్యతిరేకతే కారణమన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ నల్సార్‌ 2026 బ్యాచ్‌ విద్యార్థుల్ని న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దంటూ అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేశారు. సీజేఐపై దుష్ప్రచారం జరుగుతోందని, దీని వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని నల్సార్‌ వర్సిటీ వీసీని కోరారు. ‘ఆ ప్రచారాన్ని ఎవరు నిర్వహించారు? ఎవరు సమన్వయం చేశారో గుర్తించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. సీజేఐని ఆహ్వానించరాదని పేర్కొంటూ విద్యార్థులు ఏదైనా విజ్ఞాపనపత్రం సమర్పించి ఉంటే దాని కాపీలు, దానిపై సంతకాలు చేసిన వారి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆ విజ్ఞాపనపత్రాన్ని రాసిన వారు, మీడియాతో సమన్వయం చేసిన వారు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసిన వారు, స్నాతకోత్సవం బహిష్కరణకు పిలుపునిచ్చినవారితోపాటు దీంట్లో భాగస్వాములైన విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, బయటి వ్యక్తులు ఉంటే వారి వివరాలు కూడా ఇవ్వాలి’ అని ఆదేశించారు. వర్సిటీలో బోఽధనా సిబ్బంది మధ్య విభేదాలు, గ్రూపులు ఉన్నట్లు తెలుస్తోందని, దీంతో కొందరు అధ్యాపకులు చిల్లర రాజకీయాలు చేస్తూ విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నట్లు తెలిసిందని.. అధ్యాపకులు పాఠాలు చెప్పకుండా ఇలాంటి అసహ్యకరమైన రాజకీయాలు చేస్తుంటే బీసీఐ చూస్తూ ఊరుకోదని మనన్‌ కుమార్‌ మిశ్రా హెచ్చరించినట్లు సమాచారం. వీసీ నివేదిక అందిన తర్వాత ఈ నెల 19న ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.


అడ్డుకోవటానికి మీరెవరు?

ఈ ఆదేశాల మీద సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ ఓ వీడియో విడుదల చేశారు. ‘నిరసనను వ్యక్తీకరించటం ఒక ప్రాథమిక హక్కు. దానిని వినియోగించుకుంటూ, సీజేఐ సూర్యకాంత్‌ నుంచి తాము పట్టాలు తీసుకోబోమని నల్సార్‌ విద్యార్థులు చెబితే.. దానిని అడ్డుకోవటానికి మీరెవరు? ఇది పూర్తిగా చట్టవ్యతిరేకమైన ఆదేశం. దీనిని తక్షణం వెనక్కి తీసుకోకపోతే బీసీఐ ప్రధాన కార్యాలయంతోపాటు, మనన్‌ కుమార్‌ మిశ్రా అధికారిక నివాసం ఎదుట శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తాం. దీంట్లో పాల్గొనాలని లాయర్లు, లా విద్యార్థులు, రిటైర్డ్‌ జడ్జీలు, ప్రముఖులు అందరికీ పిలుపునిస్తున్నాం. యువతను భయపెట్టి, బెదిరించే రోజులు పోయాయన్న సంగతిని మనన్‌ కుమార్‌ మిశ్రా అర్థం చేసుకోవాలి. యువత చైతన్యవంతమైంది, బాధ్యత తీసుకుంటోంది. 2012 నుంచి బీసీఐ చైర్మన్‌గా ఉన్న మనన్‌ కుమార్‌ మిశ్రా ఇంతకాలంపాటు ఆ పదవిలో ఉండి ఏం పనులు చేశారు? దీనిపైనా మేం ఆరా తీస్తాం. ఆయన జవాబుదారీతనాన్ని లెక్క తేలుస్తాం’ అని పేర్కొన్నారు. బీసీఐ ఆదేశాలను సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు వికా్‌ససింగ్‌ తీవ్రంగా ఖండించారు. న్యాయవిద్యార్థులు తమ ప్రాథమిక హక్కు అయిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను వినియోగించుకోకుండా అడ్డుకునే, బెదిరించే ప్రయత్నమని, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని అని పేర్కొన్నారు. ఇటువంటిది గతంలో ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు.


గంటల్లోనే మార్పు

వ్యతిరేకత నేపథ్యంలో బీసీఐ తన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మరో ప్రకటన విడుదల చేసింది. ‘బీసీఐ సభ్యులు ఈ అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. నల్సార్‌ విద్యార్థుల్లో అత్యధికులు ఏ తప్పూ చేయనివారేనని, కొందరి తప్పులకు వారు బాధపడాల్సిన అవసరం లేదని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, చైర్మన్‌ జారీ చేసిన ఆదేశాల్ని సవరించాలని సభ్యులు నిర్ణయించారు. దీని ప్రకారం నల్సార్‌ విద్యార్థులు తమకు నచ్చిన రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లలో లాయర్లుగా నమోదు చేసుకోవచ్చు’ అని పేర్కొంది. అమాయక విద్యార్థులను కొందరు అధ్యాపక సిబ్బంది, బయటి వ్యక్తులు రెచ్చగొట్టినట్లు తెలిసిందని, ఈ మేరకు వీసీ నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కాగా, ఇంత వివాదానికి కారణమైన బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా న్యాయవాది మాత్రమే కాదు.. బీజేపీ నేత కూడా. బిహార్‌కు చెందిన మిశ్రా బీజేపీ నుంచి 2024లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజకీయ కారణాలతోనే ఆయన తాజా ఉత్తర్వులు వెలువరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 14 , 2026 | 07:19 AM