Share News

ప్రిన్సిపాల్‌ను చంపింది విద్యార్థులే..

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:10 AM

దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరు పదోతరగతి విద్యార్థులు! మంచిగా ఉండాలని మందలించినందుకు వారిలో ఒకడు ప్రిన్సిపాల్‌పై కక్షగట్టాడు!

ప్రిన్సిపాల్‌ను చంపింది విద్యార్థులే..

  • నల్లగొండ జిల్లాలో ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

  • దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరు టెన్త్‌ విద్యార్థులు

  • మంచి చెప్పి మందలించినందుకు ప్రిన్సిపాల్‌పై కక్ష

  • కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసి ఆమె ఇంటికి చోరీకి..

  • ఒకడు బయట కాపలా.. ఇంట్లోకి చొరబడ్డ మరొకడు

  • ప్రిన్సిపాల్‌ను చంపి.. 2.5 లక్షల నగదు చోరీ

  • ‘బాబూ.. ఏయ్‌ బాబూ’ అంటూ ఆమె ఫోన్‌లో

  • మాట్లాడిన చివరి మాటల ఆధారంగా దర్యాప్తు

  • ఇద్దరు విద్యార్థుల పట్టివేత.. వారివద్ద రూ.1.54 లక్షల నగదు స్వాధీనం

  • ఆ డబ్బులో.. మూడు రూ.500 నోట్లపై రక్తం మరకలు

  • ఇద్దరినీ జువెనైల్‌ హోమ్‌కు తరలించిన పోలీసులు

నల్లగొండ క్రైం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరు పదోతరగతి విద్యార్థులు! మంచిగా ఉండాలని మందలించినందుకు వారిలో ఒకడు ప్రిన్సిపాల్‌పై కక్షగట్టాడు! ఆమె ఇంట్లో చోరీకి వెళ్లి.. ఆమె గుర్తుపట్టడంతో కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. దోచుకున్న సొమ్మును జల్సాగా ఖర్చు పెడుతూ ఇద్దరూ పోలీసులకు దొరికిపోయారు!! నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ నెల 11వ తేదీన జరిగిన నాగార్జున కాన్సెప్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి (48) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకడు స్కూల్‌ హాస్టల్లో ఉండేవాడని, అతడికి మద్యం అలవాటు కూడా ఉందని.. హాస్టల్లో ఉంటున్న అతడి వద్ద సెల్‌ఫోన్‌ దొరకడంతో ప్రిన్సిపాల్‌ అతడిని మందలించారని ఆయన తెలిపారు. దీంతో అతడు ఆమెపై కక్ష పెంచుకున్నాడని చెప్పారు. రూపారెడ్డి(48) ఈ నెల 11వ తేదీన స్కూల్‌ వేళలు ముగిశాక సాయంత్రం 5.20 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త రాజేందర్‌రెడ్డి పనిపై హైదరాబాద్‌ వెళ్లగా, కుమారుడు ఉన్నతవిద్య కోసం హైదరాబాదులోనే ఉండడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం ఆమె తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతూ, కిచెన్‌లో టీ పెట్టుకుంటుండగా హత్యకు గురయ్యారు.


కానీ, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషయం బయటకు రాలేదు. మర్నాడు ఉదయం రాజేందర్‌రెడ్డి ఆమెకు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందించకపోవడంతో కంగారుపడి.. తమ ఇంటిపై భాగంలో అద్దెకు ఉండే వారికి ఫోన్‌ చేసి తన భార్య ఫోన్‌ తీయడం లేదని, ఏమైందో చూడమని చెప్పారు. అద్దెకుండే వ్యక్తి కిందకువచ్చి డోర్‌ కొట్టినా తీయకపోవడంతో.. అదే కాలనీలో ఉంటూ, ఆ సమయంలో అక్కడ వాకింగ్‌ చేస్తున్న ఓ ఎస్‌ఐని పిలిచి విషయం చెప్పారు. ఇద్దరూ కలిసి కిచెన్‌ వైపు వెళ్లి కిటికీ తలుపు నెట్టి చూడగా.. కిందపడిన రూపారెడ్డి కాలు కనిపించింది. ఏదో జరిగిందనే అనుమానంతో వారు తలుపు పగలగొట్టి లోపలికివెళ్లి చూడగా.. రక్తపుమడుగులో పడి ఉన్న రూపారెడ్డి మృతదేహం కనిపించింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


పట్టించిన చివరిమాట..

రూపారెడ్డి చివరగా తన చిన్నమ్మతో మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు.. ఆమెను ప్రశ్నించగా కీలకమైన క్లూ దొరికింది. రూపారెడ్డి తనతో మాట్లాడుతున్న క్రమంలో చివరగా ‘బాబూ.. ఏయ్‌ బాబూ..’ అంటూ ఒక్కసారిగా అరిచి, ఫోన్‌ సంభాషణ ఆపేసిందని, తాను మళ్లీ ఫోన్‌ చేస్తే సమాధానమివ్వలేదని, అనుమానంతో తాను ఆమె భర్త రాజేందర్‌కు విషయం తెలియజేశానని ఆమె వెల్లడించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తుచేసిన పోలీసులు.. రూపారెడ్డి తన పాఠశాలలోని మగపిల్లలను ‘బాబూ’ అని పిలుస్తారని తెలుసుకున్నారు. ఆమె పాఠశాలలో చదివే, హాస్టల్‌లో ఉండే విద్యార్థులందరితో ఒక్కొక్కరిగా మాట్లాడి ఆరాతీశారు. ఇద్దరు విద్యార్థులు పాఠశాలకు రావట్లేదని.. వారు జల్సాగా డబ్బు ఖర్చు పెడుతున్నాని గుర్తించి.. వారిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. బుధవారం ఉదయం 11.30కు దొనియాల క్రాస్‌రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆ ఇద్దరూ పోలీసులకు చిక్కారు. వారివద్ద రూ.1.54 లక్షల నగదు, ఒక ఐఫోన్‌, రెండు స్మార్ట్‌ ఫ్లోను స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించి.. తమదైన శైలిలో విచారించగా రూపారెడ్డిని ఎలా, ఎందుకు హత్య చేశారో చెప్పారని ఎస్పీ వివరించారు.


వారం రోజులుగా ప్రణాళిక..

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్‌ విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బు ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో ఉంటుందని భావించిన విద్యార్థులు.. దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్‌ ప్రకారం 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్కూల్‌ నుంచి ఒక విద్యార్థి తన ఇంటికి వెళ్లి, ఎరుపు రంగు హుడీ టీషర్ట్‌, ప్యాంట్‌ తీసుకుని వచ్చాడు. తన స్నేహితుడితో కలిసి కొండమల్లేపల్లి సెంటర్‌కు వెళ్లి కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. అనంతరం రూపారెడ్డి ఇల్లు ఉన్న కాలనీకి చేరుకుని సమీపంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ వద్ద మాటు వేశారు. ఎవరైనా వస్తున్నారేమోనని ఒకరు పరిశీలిస్తుండగా, మరొకడు మాస్క్‌ పెట్టుకుని, రూపారెడ్డి ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించాడు. అప్పటికే తెరిచి ఉన్న వంటగది నుంచి లోపలికి వెళ్లి దొంగతనం చేస్తుండగా ఆమె గుర్తుపట్టడంతో.. కత్తితో ఆమెపై దాడిచేసి 27 పోట్లు పొడిచాడు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న రూ.2.5 లక్షల నగదు తీసుకుని, బయట ఉన్న స్నేహితుడితో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. హత్యకు వినియోగించిన కత్తి, గ్లౌజులు, మాస్క్‌, రూపారెడ్డి నుంచి తీసుకువచ్చిన ఆమె ఐఫోన్‌ను వారు చెట్లపొదల్లో పడేశారు. కొంతదూరం వెళ్లాక దుస్తులు మార్చుకుని, హత్య సమయంలో వేసుకున్న ఎరుపు రంగు హుడీ టీషర్ట్‌ను విప్పి డ్రైనేజీలో పడేసి పారిపోయారు.

70సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి..

ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరకొండ డీఎస్పీ శ్రీనివా్‌సరావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఒక్కో అంశాన్ని పరిశీలిస్తూ చిక్కుముడి విప్పారు.. సుమారు 70సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి.. ఎర్రచొక్కా ధరించి వెళుతున్న విద్యార్థిని గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రూపారెడ్డి భర్త సహా దాదాపు 80మందిని పోలీసులు విచారించామని.. పూర్తి శాస్త్రీయ ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని, వారిద్దరినీ జువెనైల్‌ హోమ్‌కు తరలించామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.

Updated Date - Aug 20 , 2026 | 05:58 AM