నోష్ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌ఓ కార్మికుడి మృతి.. ఏడుగురికి గాయాలు
ABN , Publish Date - May 02 , 2026 | 05:09 AM
కార్మికుల దినోత్సవం (మేడే) రోజున విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని నోష్ ఫార్మా కంపెనీలో మరోసారి రియాక్టర్ పేలింది...
23 రోజుల్లో రెండు సార్లు ప్రమాదం
కార్మిక దినోత్సవం రోజు విషాదం
చిట్యాలరూరల్, మే 1 (ఆంధ్రజ్యోతి): కార్మికుల దినోత్సవం (మేడే) రోజున విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని నోష్ ఫార్మా కంపెనీలో మరోసారి రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయ్యాలయ్యాయి. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేసే నోష్ ఫార్మా ల్యాబ్‌లో శుక్రవారం మధ్యాహ్నం కార్మికులు విధులు నిర్వహిస్తుండగా రియాక్టర్ భారీ శబ్దాలతో ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మూడో బ్లాకులో ఉన్న తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను చౌటుప్పల్‌లోని ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణగౌడ్ (33) చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయపడిన వారిలో ఎం.లింగస్వామి (పిట్టంపల్లి), ఎన్.శంకర్ (పంతంగి), సీహెచ్‌వరప్రసాద్ (సంస్థాన్‌నారాయణపురం), డేవిడ్ కుజుర్ (ఝార్ఖండ్), ఎన్.వెంకటేశ్వరరావు (కోనసీమ), టి.లోకేశ్వర్‌రావు(మలిచర్ల), హనుమాన్‌గౌడ్ (ఎల్‌బీనగర్) ఉన్నారు. కాగా, కార్మికుల దినోత్సవం రోజు కూడా పనిచేయించి ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
23 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఘటన
ఇదే పరిశ్రమలో గత నెల 9న కూడా రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మంటలు వ్యాపించడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మరువకముందే 23 రోజుల వ్యవధిలోనే మరోసారి రియాక్టర్ పేలింది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి, వరుస ప్రమాదాలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కంపెనీలో ఉత్పత్తి కార్యకలాపాలు చేయవద్దని ఆదేశించారు.
నోష్ ల్యాబ్‌ను వెంటనే మూసివేయాలి
భారీ పేలుడు సంభవించడం, కంపెనీ నుంచి పొగలు వ్యాపించడంతో సమీప గ్రామాలైన పిట్టంపల్లి, బొంగోనిచెర్వు, వెలిమినేడు ప్రజలు అధిక సంఖ్యలో నోష్‌ల్యాబ్ కంపెనీ వద్దకు చేరుకుని, కంపెనీకి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. వరుస ప్రమాదాలతో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ఫార్మా ల్యాబ్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.