నల్లగొండలో హోరాహోరీ!
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:05 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునిసిపల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోని సూర్యాపేట, భువనగిరి, ప్రాధాన్యం కలిగిన మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్ మునిసిపాలిటీల్లో.....
కార్పొరేషన్, 17 మునిసిపాలిటీల్లో గెలుపుపై కాంగ్రెస్ గురి
అన్ని చోట్లా అధికార పార్టీకి గట్టిపోటీ ఇస్తున్న బీఆర్‌ఎస్
సూర్యాపేట జిల్లా బాధ్యతలు భుజానికెత్తుకున్న ఉత్తమ్
నల్లగొండ కార్పొరేషన్‌పై పట్టుకోసం కోమటిరెడ్డి వ్యూహం
నల్లగొండ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునిసిపల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోని సూర్యాపేట, భువనగిరి, ప్రాధాన్యం కలిగిన మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్ మునిసిపాలిటీల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. దాదాపు అన్ని మునిసిపాలిటీల్లోనూ మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరీగా తలపడుతుంటే.. సంప్రదాయ ఓటుబ్యాంకు, యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఈ రెండు పార్టీలకు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.
సూర్యాపేట జిల్లా బాధ్యతలు ఉత్తమ్‌పై..
సూర్యాపేట జిల్లాలోని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన సొంత నియోజకవర్గంలోని హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తన సతీమణి పద్మావతిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని కోదాడ మునిసిపాలిటీలో క్లీన్‌స్వీ్‌ప చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇక్కడ మూడు వార్డులు, హుజూర్‌నగర్‌లో ఒక వార్డును కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మిగిలిన వార్డుల్లోనూ బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పోటీ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి మద్దతుగా నిలిచి ప్రచారం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట మునిసిపాలిటీలో 48 వార్డుల్లోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న జగదీ్‌షరెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పోరాడుతున్నారు. తిరుమలగిరి, మోత్కూరు మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే మందుల సామేలు, బీఆర్‌ఎస్ తరఫున గాదరి కిశోర్‌కుమార్ ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు... భువనగిరితోపాటు భూదాన్ పోచంపల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అందరికంటే ముందే ప్రకటించి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థులకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నారు. బీజేపీ సైతం అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది.
నల్లగొండలో కోమటిరెడ్డి..
నల్లగొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పనిచేస్తున్నారు. మేయర్ అభ్యర్థిని కూడా ముందుగానే బుర్రి చైతన్య శ్రీనివా్‌సరెడ్డిని ప్రకటించారు. ప్రతిరోజూ నాలుగైదు డివిజన్లలో అభ్యర్థుల తరపున మంత్రి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పార్టీ సంప్రదాయ ఓటింగ్, క్యాడర్ కలిగిన బీజేపీ సైతం అన్ని వార్డుల్లో అభ్యర్థులను బరిలో దించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రచారం నిర్వహించారు. ఇక మిర్యాలగూడ మునిసిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యూహాలు అమలు చేస్తుండగా, బీఆర్‌ఎస్.. సీపీఎంతో పొత్తుపెట్టుకుంది.
చిన్న మునిసిపాలిటీలపైనా పెద్ద స్కెచ్..
ఉమ్మడి జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్, ఐదు పెద్ద మునిసిపాలిటీలు మినహాయిస్తే.. మిగిలిన మునిసిపాలిటీలన్నీ మేజర్ గ్రామపంచాయతీల కంటే కొంచెం ఎక్కువ జనాభా మాత్రమే కలిగి ఉన్న పట్టణాలు. అయితే ఈ చిన్న పట్టణాలపైనా రాజకీయ పార్టీలు పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. హాలియా, నందికొండ మునిసిపాలిటీలను క్లీన్‌స్వీ్‌ప చేస్తామనే నినాదంతో ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రంగంలోకి దిగారు. ఇక చండూరు, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రంగంలోకి దిగారు. చిట్యాల మునిసిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీసుకున్నారు. ఇక ఆలేరు, యాదగిరిగుట్ట మునిసిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య గట్టిపోటీ నెలకొనగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్యే సునీత తమ పార్టీల అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తున్నారు.