పోకిరి వేధింపులకు వైద్యవిద్యార్థిని బలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:18 AM
వైద్యవిద్యను పూర్తిచేసి.. డాక్టర్‌గా నిరుపేదలకు సేవ చేయాలన్న తన ఆశయానికి చేరువలో నిలిచిన ఆ యువతి, ఓ పోకిరి వేధింపులకు బలైంది. ప్రేమ పేరుతో అతడు అదేపనిగా వెంటబడుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమ పేరుతో ఏడాదిగా వెంటపడుతున్న యువకుడు
ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు
ఇది తెలిసి.. భయంతో ఆ యువకుడి బలవన్మరణం
నల్లగొండ జిల్లా మునుకుంట్ల గ్రామంలో విషాదం
కట్టంగూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్యను పూర్తిచేసి.. డాక్టర్‌గా నిరుపేదలకు సేవ చేయాలన్న తన ఆశయానికి చేరువలో నిలిచిన ఆ యువతి, ఓ పోకిరి వేధింపులకు బలైంది. ప్రేమ పేరుతో అతడు అదేపనిగా వెంటబడుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మనుకుంట్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ అమ్మాయి బలవన్మరణంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ జులాయి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మునుకుంట్లకు చెందిన సుక్క లింగయ్య, యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానంలో లక్ష్మీ ప్రసన్న (21) ఒకరు! ఆమె సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. రోజూ గ్రామం నుంచి కాలేజీకి బస్సులో వెళ్లి వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చిలుముల రామ్‌చరణ్ (25) అనే యువకుడు టెన్త్ దాకా చదివి పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఏడాదిగా లక్ష్మీప్రసన్నను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. విషయాన్ని లక్ష్మీ ప్రసన్న తన అక్కకు చెప్పుకొని బాధపడగా, ఆమె వెళ్లి రామ్‌చరణ్‌ను తీవ్రంగా మందలించింది. అయితే అతడు తన తీరు మార్చుకోకపోగా లక్ష్మీ ప్రసన్నను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీ ప్రసన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసి.. రామ్‌చరణ్ తనను లక్ష్మీ ప్రసన్న తరఫువారు, గ్రామస్థులు ఏం చేస్తారోనని భయపడిపోయి శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. అంతకుముందు అక్కడ ఉన్న తండ్రి సమాధిపై రక్తంతో చిన్నారి (లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్) అని రాశాడు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.