గొంతు కోసి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టి
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:36 AM
తనకివ్వాల్సిన అప్పు వసూలు చేసేందుకు వెళ్లిన వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులు కత్తిపీటతో ఆమె గొంతు కోసి చంపి, ఆ సెంటర్ ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారు.
అప్పు వసూలు చేసేందుకు వెళ్లిన వృద్ధురాలి హత్య
నల్లగొండ జిల్లా హాలియాలో ఘటన
హాలియా, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తనకివ్వాల్సిన అప్పు వసూలు చేసేందుకు వెళ్లిన వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులు కత్తిపీటతో ఆమె గొంతు కోసి చంపి, ఆ సెంటర్ ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీలో జరిగింది. రెడ్డి కాలనీలో ఒంటరిగా ఉంటూ వ్యవసాయ కూలీగా పనిచేసే సుంకిరెడ్డి అనసూయమ్మ (65), స్థానిక ధనలక్ష్మి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు చిన్నపాక రాములుకు కొంత నగదు అప్పుగా ఇచ్చింది. ఈనెల 24న అప్పు వసూలు చేసేందుకు ఆమె ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లింది. అక్కడ డబ్బు విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో అనసూయమ్మ ధరించిన రెండు తులాల బంగారు పుస్తెలతాడుపై రాములు, అతడి భార్య ధనలక్ష్మి, వారి పెద్ద కుమారుడు గౌరి కన్ను పడింది. దీంతో ముగ్గురు కలిసి కత్తిపీటతో ఆమెపై దాడిచేశారు. తలపై బలంగా కొట్టి, గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వెనుక భాగంలో పాతిపెట్టారు. ఏమీ ఎరుగనట్టు రెండు రోజుల పాటు సెంటర్‌ను మూసివేసిన నిందితులు స్థానికంగానే తిరిగారు. అనసూయమ్మ ఇంటికి రాకపోవడంతో ఆమె అక్క కుమార్తె సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఆమె హత్యకు గురైనట్లు గుర్తించారు. సోమవారం నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకుని విచారణ చేయగా తామే హత్య చేశామని అంగీకరించినట్లు హాలియా సీఐ సతీ్‌షరెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పాతిపెట్టిన మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు సీఐ వెల్లడించారు.