నైనీపై సమాలోచనలు!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:02 AM
నైనీ బొగ్గు గనుల టెండర్ వివాదంతో పాటు బడ్జెట్ సమావేశాలు, మునిసిపల్ ఎన్నికలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు సోమవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు.....
ప్రజాభవన్‌లో భట్టితో ఉత్తమ్, శ్రీధర్‌బాబు, అడ్లూరి సమావేశం
సైట్ విజిట్ నిబంధనతోపాటు బడ్జెట్ సమావేశాలు, మునిసి‘పోల్స్’పై చర్చ
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నైనీ బొగ్గు గనుల టెండర్ వివాదంతో పాటు బడ్జెట్ సమావేశాలు, మునిసిపల్ ఎన్నికలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు సోమవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు సమావేశమయ్యారు. లోక్‌భవన్‌లో గవర్నర్ తేనేటి విందు అనంతరం.. ప్రజాభవన్‌లో భట్టితో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లు ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు జరిపారు. ప్రధానంగా నైనీ బొగ్గు గనుల టెండర్ వివాదంపై వీరు చర్చించినట్లు సమాచారం. నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో అవకతవకల నేపథ్యంలో సింగరేణి టెండర్లు రద్దు చేయడం.. ఈ విషయమై కేంద్రం వేసిన సాంకేతిక కమిటీ అధ్యయనం జరిపి నివేదిక సమర్పించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే నైనీ కోల్ బ్లాక్ వివాదానికి కారణాలేంటి..? సైట్ విజిట్ నిబంధన ఏంటి..? ఏయే రాష్ట్రాల్లో, సంస్థల్లో ఈ నిబంధన ఉంది..? అన్న విషయాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సర్కారుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఇక బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ల వ్యాఖ్యలపై కూడా చర్చించినట్లు తెలిసింది. సింగరేణిలో ఓవర్‌బర్డెన్, ఎక్స్‌ప్లోజివ్ టెండర్లన్నీ కూడా బీఆర్‌ఎస్ చేతుల్లోనే ఉన్నాయని, 25 టెండర్లకు గానూ 20 టెండర్లు బీఆర్‌ఎస్ కేటాయించినవేనని, సింగరేణి టెండర్ల వ్యవహారంపై సిట్ విచారణ చేపడితే ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా సమాలోచనలు జరిగినట్లు సమాచారం. అలాగే కేంద్ర బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి.. ఏయే రంగాలకు ప్రధానంగా కేటాయింపులు ఉండాలనే దానిపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఇక త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగనుండటంతో ఇన్‌చార్జులుగా మంత్రులు బాధ్యతలు అందుకున్న జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్లు సమాచారం.