Naini Coal Mine: నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ రద్దు
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:17 AM
డిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.
వెబ్‌సైట్ నుంచి డాక్యుమెంట్ల తొలగింపు
త్వరలో మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం
‘ఆంధ్రజ్యోతి’ కథనాల ఎఫెక్ట్
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సోమవారం https://tender.telangana.gov.in/login.html అనే ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ నుంచి సంబంధిత డాక్యుమెంట్లను తొలగించారు. కోల్ లింకేజీలో భాగంగా సింగరేణికి ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గని దక్కిన విషయం తెలిసిందే. ఈ గనిలో తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి పనులకు టెండర్ వేసే సంస్థ విధిగా దాన్ని సందర్శించాలి. ఆ సంస్థ బొగ్గు గనిని సందర్శించినట్లు సింగరేణి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధనపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదివారం ‘బొగ్గు కోసం నీచ కథనం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు ఏ నిబంధనలు విధించాయో వాటిపై అధ్యయనం చేసి.. తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతోనే వెబ్‌సైట్ నుంచి టెండర్ డాక్యుమెంట్‌ను తొలగించినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటిదాకా సింగరేణి యాజమాన్యం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.
కాగా, నైనీ బొగ్గు గనిలో ఓవర్ బర్డెన్ (బొగ్గుపై ఉండే మట్టి, ఇతర రాళ్లు) తొలగింపు, బొగ్గు వెలికితీత, ఆ బొగ్గును తొలి విడతలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)-1, 2లకు తరలించడం, మలి విడతలో మూడో సీహెచ్‌పీకి తరలించే పనులను 25 ఏళ్ల కాలానికి గాను అప్పగించడానికి వీలుగా రూ.1604.42 కోట్లతో సింగరేణి ఈ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా బొగ్గు బ్లాకు సమగ్ర నిర్వహణ పనులను ఎవరికైనా అప్పగించాలంటే ఓవర్ బర్డెన్ తొలగింపు, భారీ గని నిర్వహణలో పూర్వానుభవంతో పాటు బొగ్గు తరలింపునకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలు, అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ నైనీ బొగ్గు గని విషయంలో మాత్రం విధిగా గనిని సందర్శించి, పరిసరాలను గమనించాలని, అంతేకాకుండా సింగరేణి సంస్థ నుంచి సర్టిఫికెట్ పొందాలనే విచిత్రమైన నిబంధన పెట్టడమే వివాదాలకు కారణమైంది. దాంతో టెండర్ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి నిర్ణయించింది.