Share News

Naini Block Tender Controversy: నచ్చినోళ్లకే.. నైనీ బ్లాక్‌

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:33 AM

కోల్‌ లింకేజీలో భాగంగా ఒడిశాలోని అంగూల్‌ జిల్లా కరోల్‌బహాల్‌లో దక్కిన నైనీ బ్లాకును నచ్చినవారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా...

Naini Block Tender Controversy: నచ్చినోళ్లకే..  నైనీ బ్లాక్‌

  • 25 ఏళ్ల కాలానికి ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి, రవాణా కోసం టెండర్లు

  • టెండర్‌ వేసే సంస్థలు గనిని సందర్శించి, సింగరేణి సంస్థ నుంచి

  • ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన

  • బ్లాకును సందర్శించిన 16కు పైగా సంస్థలు.. ఇంకా ఎవరికీ అందని సర్టిఫికెట్‌

  • ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికెట్‌ ఇచ్చి బ్లాక్‌ కేటాయించే ప్లాన్‌?

  • అదానీని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివా్‌సకు కట్టబెట్టేందుకు గతంలో యత్నాలు

  • అప్పట్లో ఢిల్లీదాకా వెళ్లి ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కోల్‌ లింకేజీలో భాగంగా ఒడిశాలోని అంగూల్‌ జిల్లా కరోల్‌బహాల్‌లో దక్కిన నైనీ బ్లాకును నచ్చినవారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా? కొందరు పెద్దలు ఈపాటికే దాన్ని ఎవరికి కట్టబెట్టాలో ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకే నిబంధనలు రూపొందించి రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారా? ..అంటే, ఆ టెండర్‌ కేటాయించడానికి పెట్టిన నిబంధనలు చూస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. తమకు కావాల్సిన వారికి ఈ బ్లాకును కట్టబెట్టే వ్యూహంలో భాగంగానే.. ‘టెండర్‌ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాకును సందర్శించాలి.. ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణియే సర్టిఫికెట్‌ ఇవ్వాలి’ అనే అసాధారణ నిబంధనను పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధన ప్రకారం ఇప్పటిదాకా 16కు పైగా సంస్థలు నైనీ బ్లాకును సందర్శించినప్పటికీ.. వాటిలో ఏ ఒక్క సంస్థకూ గనిని సందర్శించినట్లు, పరిశీలించినట్లు సర్టిఫికెట్‌ చేతికి అందకపోవడమే ఇందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో రెండు వారాల్లో టెండర్‌ గడువు పూర్తికానుండగా.. ఇప్పటిదాకా ఏ ఒక్క సంస్థకూ ఆ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతో.. ఆఖరి నిమిషంలో తమకు కావాల్సిన సంస్థకు ఆ సర్టిఫికెట్‌ ఇచ్చి, కాంట్రాక్టు కట్టబెట్టాలనే కుట్ర ఈ వ్యవహారంలో దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. కాగా.. గతంలో అదానీని ముందు పెట్టి ఈ బ్లాకును ప్రతిమా శ్రీనివాస్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి.


అయితే, అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ దాకా వెళ్లి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఒడిశాలో నైనీ కోల్‌ మైన్‌లో ఓవర్‌ బర్డెన్‌ (బొగ్గుపై ఉండే మట్టి, ఇతర రాళ్ల) తొలగింపు, బొగ్గు వెలికితీత, బ్లాక్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం)తో నిర్మాణ పనులు, తీసిన బొగ్గును తొలి విడతలో కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (సీహెచ్‌పీ)-1, 2 (బొగ్గును లోడ్‌ తీసి తరలించడానికి ఉద్దేశించిన కేంద్రాలు), మలి విడతలో మూడో సీహెచ్‌పీకి బొగ్గును తరలించే పనులు 25 ఏళ్లకాలానికిగాను అప్పగించడానికి రూ.1604.42 కోట్లతో సింగరేణి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. టెండర్‌ దాఖలుకు తుదిగడువు జనవరి 29. సాధారణంగా బొగ్గు బ్లాకు సమగ్ర నిర్వహణ పనులు ఎవరికైనా అప్పగించాలంటే భారీ గనుల నిర్వహణలో అనుభవం, ఓవర్‌ బర్డెన్‌ తీసిన అనుభవం, బొగ్గు తరలింపు సామర్థ్యం, సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే నైనీబ్లాకు విషయంలో మాత్రం.. విధిగా బ్లాకును సందర్శించి, పరిసరాలన్నీ గమనించాలని, ఈమేరకు సింగరేణి సంస్థ నుంచి సర్టిఫికెట్‌ పొందాలనే విచిత్రమైన, అసాధారణమైన నిబంధన పెట్టారు. ఒకసారి మహారాష్ట్రలో ఇలాంటి నిబంధన పెట్టి.. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. ఇప్పుడు సింగరేణి సంస్థ ఈ నిబంధన పెట్టడం వెనుక మతలబు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఏడాది పాటే ఇబ్బంది.. తర్వాత రాచబాట

మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు కోసం ఒడిశాలో నైనీ బ్లాకును కేటాయించారు. అయితే, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో బ్లాకుకు వెళ్లడానికి సరైన దారి లేదు. ఉన్నదల్లా ఒక ఇరుకైన రోడ్డు మాత్రమే. ఈ బ్లాకులో దాదాపు 350 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 2025లో ఈ బ్లాకులో రెండేళ్లకాలానికి గాను టెండర్లు ఒక సంస్థకు అప్పగించగా.. ఆ సంస్థ 6 లక్షల టన్నుల బొగ్గు తీసింది. అయినప్పటికీ దానిని తరలించలేని పరిస్థితి. అయితే మరో ఏడాదిలో ఈ బ్లాకుకు రోడ్డుసౌకర్యం కల్పించే అవకాశాలున్నట్టు సమాచారం. ఐదేళ్లలో రైలు మార్గం కూడా వేయనున్నారు. అంటే.. ఏడాది పాటు ఇబ్బందులున్నా, ఆ తర్వాత 24 ఏళ్ల పాటు ఏ ఇబ్బందులూ వచ్చే అవకాశాల్లేవు. అయినప్పటికీ ఏడాదిపాటు ఇబ్బందులను సాకుగా చూపించి.. మరే సంస్థా టెండర్‌లు దక్కించుకోకుండా అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

నల్ల ‘బంగారమే’!

అత్యంత నాణ్యమైన రకంగా చెప్పే జీ-10 రకం బొగ్గు ఈ బ్లాకులో ఉండటంతో ఈ గని సింగరేణికి కల్పతరువుగా మారుతుందని అంతా భావిస్తున్నారు. అంతేకాదు.. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న ఓపెన్‌కాస్టు గనుల్లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్‌ మీటర్ల ఓబీ(ఓవర్‌బర్డెన్‌) తొలగించాల్సి ఉండగా నైనీ బ్లాకు ఓపెన్‌ కాస్ట్‌ గనిలో మాత్రం ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.58 క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగిస్తే సరిపోనుంది. ఏడాదికి 80 లక్షల టన్నుల సామర్థ్యం గల ఒక వాషరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 05:33 AM