పొలం వద్ద సెల్ఫీలు దిగుతూ నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:22 AM
పొలం వద్ద ఫొటోలు దిగుతూ నీటి గుంతలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పొయారు.
మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు
నాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో విషాదం
ఊర్కొండ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పొలం వద్ద ఫొటోలు దిగుతూ నీటి గుంతలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పొయారు. ఈ విషాద సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మాధు శ్రీకాంత్‌రెడ్డి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని తుర్కయాంజల్‌లో నివసిస్తున్నారు. అనారోగ్యంతో బాధపతున్న తన తల్లి సరస్వతమ్మను చూసేందుకు భార్య రజని, కుమారుడు శ్రీమాన్యు (12), కుమార్తె శ్రీకృతి (సిరి) (14), సోదరి చంద్రకళ, ఆమె కుమార్తె ఎడ్మ స్నేహ (17)లతో కలిసి శనివారం స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం పిల్లలందరూ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి సమీపంలోని పొలానికి వెళ్లారు. అక్కడున్న నీటి గుంత పక్కన పిల్లలు ఆడుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో శ్రీమాన్యు ప్రమాదవశాత్తు కాలుజారి గుంతలో పడిపోయాడు. అతడిని కాపాడే యత్నంలో సిరి, స్నేహ కూడా నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు శ్రీకాంత్‌రెడ్డి సోదరుడి కుమార్తె మాధు విద్యాధరణి కూడా గుంతలోకి దిగి భయంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో శ్రీకాంత్‌రెడ్డి అక్కడికి చేరుకొని విద్యాధరణిని బయటకు లాగేశారు. ఆయనకు ఈత రాకపోవడంతో గుంతలో మునిగిన ముగ్గురిని కాపాడలేక నిస్సహయ స్థితిలో ఉండిపోయారు. పరిసర ప్రాంత రైతులు అక్కడికి చేరుకొని ముగ్గురినీ బయటకు తీయగా అప్పటికే వారు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణదేవ తెలిపారు. శ్రీమాన్య ఆరో తరగతి, శ్రీకృతి ఎనిమిదో తరగతి, స్నేహ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.