మా భవిష్యత్తును కాపాడండి
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:26 AM
దూర విద్య విధానంలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన 1,24,524 మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని మంగళవారం ‘ప్రజావాణి’లో విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్‌లో...
‘ప్రజావాణి’లో నాగార్జున వర్సిటీ దూరవిద్య విద్యార్థుల విజ్ఞప్తి
హైదరాబాద్, బేగంపేట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : దూర విద్య విధానంలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన 1,24,524 మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని మంగళవారం ‘ప్రజావాణి’లో విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇన్‌చార్జి జి.చిన్నారెడ్డికి తమ గోడును వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున యూనివర్సిటీ నుంచి దూర విద్యా విధానంలో తెలంగాణకు చెందిన తాము డిగ్రీలు, పీజీలు పూర్తి చేశామని తెలిపారు. నాగార్జున వర్సిటీ ద్వారా డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకున్న తెలంగాణ విద్యార్థులకు 2021 వరకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు లభించాయన్నారు. అయితే.. 2022లో తెలంగాణ ఉన్నత విద్యామండలి.. నాగార్జున యూనివర్సిటీ దూర విద్య ధ్రువపత్రాలను అంగీకరించబోమని చెప్పిందని, దాంతో తాము హైకోర్టును ఆశ్రయించగా.. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినా.. తమ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. దీనిపై జి.చిన్నారెడ్డి విద్యా శాఖ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.