Share News

నాదర్‌గుల్‌లో 7వేల కోట్ల భూకుంభకోణం

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:41 AM

రంగారెడ్డిజిల్లా నాదర్‌గుల్‌లో రూ.7వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు తెరలేపారని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.

నాదర్‌గుల్‌లో 7వేల కోట్ల భూకుంభకోణం

  • తెరవెనుక మంత్రి పొంగులేటి వర్గం

  • 373 ఎకరాల సర్కారు భూమిపై అధికార పార్టీ నేతల కన్ను

  • హైడ్రాకు ఈ కబ్జాలు కనబడవా..?

  • బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డిజిల్లా నాదర్‌గుల్‌లో రూ.7వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు తెరలేపారని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సర్వేనంబర్‌ 613 (కొత్త సర్వేనంబర్‌ 119)లో ఉన్న 373 ఎకరాల భూకబ్జా వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. పలు కంపెనీలకు చెందిన పెద్దలు ఉన్నారని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తరతరాలుగా ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న 600 మంది పేద రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, బౌన్సర్లు, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘‘అక్కడ 40ఏళ్లుగా సాగుచేసుకుంటున్న కౌసల్య, మమతలాంటి మహిళా రైతులను రూ. 5-10లక్షలు ఇచ్చి పంపించేందుకు చూస్తున్నారు. బోర్లు, కంచెలు ధ్వంసం చేస్తున్నారు. ఆ 373 ఎకరాల్లో 17 ఎకరాల లచ్చమ్మ కుంట, 6ఎకరాల బఫర్‌ జోన్‌ ఉంది. ఆ చెరువుకు వచ్చే ఫీడర్‌ ఛానల్స్‌ అన్నింటినీ.. ఆక్రమణకు పాల్పడిన కంపెనీలు ధ్వంసం చేశాయి. లచ్చమ్మ కుంట నిండితే అక్కడి నుంచి నాన్‌ చెరువు, మర్రివాని కుంట, రెడ్డి కుంట, సున్నం చెరువు, చివరకు ఇంజాపూర్‌ మాసం చెరువు వరకు నీళ్లు వెళ్తాయి. పర్యావరణానికి ఇంత ముప్పు వాటిల్లుతున్నా హైడ్రా ఎందుకు మౌనంగా ఉంది? అధికార పార్టీ నేతల కబ్జాలు హైడ్రాకు కనబడవా..? పేదోడికో న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా?’’ అని ఆయన ప్రశ్నించారు. చెరువుల్ని కాపాడుతామని చెప్పుకునే హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు నాదర్‌గుల్‌ ఆక్రమణలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. తమ భూములు కబ్జా చేస్తున్నారని పేద రైతులు ఫిర్యాదు ఇచ్చినా.. హైడ్రా కళ్లు మూసుకుందని మండిపడ్డారు. నాదర్‌గుల్‌ భూములు.. ప్రభుత్వ భూములేనని 2005లోనే అప్పటి ఆర్డీవో స్పష్టం చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు కోర్టులకు వెళ్లగా.. 2017లో సుప్రీంకోర్టు, 2022లో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయని పేర్కొన్నారు. సాగుభూమినే కాకుండా 80 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టలను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఇంత మైనింగ్‌ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ భూములు తనవేనని శివరాజ్‌ బహదూర్‌ అనే వ్యక్తి నిజాంకాలం నాటి మాటలు చెబుతూ.. 2016లో ఆల్ఫా, ఒమేగా, యునిటెక్‌ అనే కంపెనీలకు విక్రయించారని హరీశ్‌రావు ఆరోపించారు. ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదనీ, సెక్షన్‌ 8, 17 ప్రకారం సీలింగ్‌ డిక్లరేషన్‌ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. ఈ విక్రయాలు చెల్లవని కందుకూరు ఆర్డీవో తేల్చిచెప్పారని, ఆ నిర్ణయాన్నే హైకోర్టు సమర్థించిందని పేర్కొన్నారు. భూభారతిలోనూ భూమి నిషేధిత జాబితాలోనే ఉందని వివరించారు.


సీఎంకు సవాల్‌

సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్థి ఉంటే తక్షణమే హైడ్రాను నాదర్‌గుల్‌కు పంపి కబ్జాదారులను అరెస్ట్‌ చేయించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. చెరువులను కాపాడుతున్నామని చెప్పే సీఎంకు ఈ కబ్జాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సోమవారం ఉదయానికల్లా హైడ్రా రంగనాథ్‌ అక్కడకు వెళ్లి చర్యలు తీసుకోకపోతే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ కలిసి నాదర్‌గుల్‌లో ప్రత్యక్ష నిరసనకు దిగుతామని హెచ్చరించారు.

Updated Date - Apr 06 , 2026 | 04:41 AM