పొంగులేటి, హర్షరెడ్డిలకు సంబంధం లేదు
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:42 AM
నాదర్‌గుల్ భూములపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కోహినూర్ గ్రూప్ సంస్థ వెల్లడించింది. ఇందులో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్ష రెడ్డికి సంబంధం లేదని తెలిపింది.
నాదర్‌గుల్ భూములపై బీఆర్‌ఎస్ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం
2015 వరకు కోర్టులో భూవివాదం
ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదు
కోహినూర్ గ్రూప్ డైరెక్టర్ అమ్జాద్ ఖాద్రీ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : నాదర్‌గుల్ భూములపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కోహినూర్ గ్రూప్ సంస్థ వెల్లడించింది. ఇందులో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్ష రెడ్డికి సంబంధం లేదని తెలిపింది. ఈమేరకు ఆదివారం సంస్థ డైరెక్టర్ అమ్జాద్ ఖాద్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమి హక్కులపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొంది. ఏక్యూ స్వ్కేర్ రియల్టర్ సంస్థ 2021లో మొత్తం స్థలం చుట్టూ రేకులతో ప్రహరీని ఏర్పాటు చేసిందని తెలిపింది. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్‌లోని టైమ్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చని... ఈ పనులు 2022 మే నెలలో పూర్తయ్యాయని... ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినవి కావని తెలిపింది. ఏక్యూ ేస్క్వర్ రియల్టర్స్, దాని అనుబంధ సంస్థ క్రిస్టల్ మ్యాన్షన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ 2021 డిసెంబర్ 6 నుంచి 2023 మార్చి 1వరకు పొంగులేటి హర్షరెడ్డి అదనపు డైరెక్టర్‌గా ఉన్నారని తెలిపింది. అనంతరం ఆయన బోర్డుకు రాజీనామా చేశారని ఆ వివరాలు ఎంసీఏ రికార్డుల్లో నమోదయ్యాయంది. నిరాధార ఆరోపణలు చేస్తూ నాదర్‌గుల్ భూవ్యవహారాన్ని పొంగులేటికి, హర్షరెడ్డికి ఆపాదిస్తున్నారని పేర్కొంది. వాస్తవానికి ఆ భూమి రాజా శివ్‌రాజ్ బహదూర్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తి. 2015లో ఆయన వారసులే హక్కుదారులని సుప్రీంకోర్టు తన తుది తీర్పుతో ధ్రువీకరించిదని, అసలు ఈ భూమిపై వివాదం 2005లో ప్రారంభమైందని వెల్లడించింది. యాజమాన్యం, ఆక్యుపెన్సీ హక్కులపై డిక్లరేషన్, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. 2007 ఏప్రిల్ 30న ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసిందని తెలిపింది. దీనిపై హైకోర్టులో అప్పీల్ దాఖలు కాగా, 2011 డిసెంబర్ 19 నాటి తీర్పులో పిటిషనర్లను యజమానులుగా కోర్టు గుర్తించిందని పేర్కొంది. ‘‘రాష్ట్ర ప్రభుత్వం 2013లో దాఖలు చేసిన సివిల్ అప్పీలును సుప్రీంకోర్టు తిరస్కరించింది. భూయజమానులకు ఆక్యుపెన్సీ హక్కులు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది.
2015వరకు భూమి వివాదంలో ఉండడంతో.. ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం అమలు కాదని సంస్థ పేర్కొంది. 2020 జనవరి 9న ల్యాండ్ రిఫార్మ్స్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై భూయజమానులు అప్పీల్ దాఖలు చేయగా అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉందంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి పాట్ ఖరాబ్‌గా నమోదైంది. ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదు. నాలా కన్వర్షన్ అనుమతి తిరస్కరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుల పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో మీడియా ట్రయల్ నిర్వహించడం సరికాదు. ఇంతవరకు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమిగా నమోదైంది. 2005లో ప్రారంభమైన వివాదం.. చివరకు 2015లో ప్రైవేట్ పట్టా భూమిగా తేలింది. సుప్రీంకోర్టు పిటిషనర్ల ఆక్రమణ హక్కులను గుర్తించి, చట్ట ప్రక్రియను అనుసరించకుండా ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకోలేదని కోర్టు స్పష్టంచేసింది. 2016లో దాఖలైన రివ్యూ పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. 2021లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ భూమికి సంబంధించిన డెవల్‌పమెంట్ ఒప్పందం ప్రస్తుతం ఏక్యూ ేస్క్వర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉంది. రాజా శివ్‌రాజ్ బహదూర్ వారసుల ప్రతినిధి కరీం అల్లాదీన్‌తో ఏక్యూ ేస్క్వర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒమేగా డెవల్‌పమెంట్‌వెంచర్స్, ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్, యునైటెడ్ ల్యాండ్‌మార్క్స్‌తోనూ ఒప్పందాలున్నాయి’’ అని కోహినూర్ సంస్థ తెలిపింది.