Share News

నాదర్‌గుల్‌ భూములపై మౌనం వీడాలి

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:02 AM

రెవెన్యూ చట్టాలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని, నాదర్‌గుల్‌ భూములపై రెవెన్యూ యంత్రాంగం మౌనం వీడాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది.

నాదర్‌గుల్‌ భూములపై మౌనం వీడాలి

  • పొంగులేటి ప్రోద్బలంతోటే ప్రభుత్వ భూముల కబ్జా

  • బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న బీఆర్‌ఎస్‌

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ చట్టాలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని, నాదర్‌గుల్‌ భూములపై రెవెన్యూ యంత్రాంగం మౌనం వీడాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లోని సర్వే నెంబరు 613లో గల 373.22 ఎకరాలను స్వాధీ నం చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్‌, సురభి వాణిదేవి, బీఆర్‌ఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ కె.చంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నాదర్‌గుల్‌లోని సర్వే నెంబరు 613లోని భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవె న్యూ యంత్రాంగం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రోద్బలంతో కొంతమంది రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ భూములను కాపాడకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో షీట్స్‌ వేస్తూ, చెరువును కబ్జా చేస్తుంటే జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఆల్ఫా ఎస్టేట్స్‌, ఓమెగా డెవెల్‌పమెంట్స్‌ వెంచర్‌, కోహినూర్‌ కంపెనీ, ఇతర వ్యక్తుల నుంచి వెంటనే అధికారులు భూములను స్వాధీనం చేసుకుని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నాదర్‌గుల్‌లోని సర్వే నెంబరు 613లో ఉన్న భూములను ప్రభుత్వం నిషేదిత జాబితాలో చేర్చిందని, సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిందని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 05:02 AM