పోలీసు స్కూల్‌కు ఎంవైకే లాటిక్రెట్ ఫౌండేషన్ 2 కోట్ల సాయం
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:29 AM
యంగ్ ఇండియా పోలీసు స్కూల్ నిర్మాణానికి కార్పొరేట్ సంస్ధలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
విద్య కోసం అందించే సహాయం
తరతరాలకు ప్రయోజనం : డీజీపీ
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా పోలీసు స్కూల్ నిర్మాణానికి కార్పొరేట్ సంస్ధలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. విద్య కోసం అందించే సహాయం సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుందని, ఆ ప్రయోజనాలు భవిష్యత్ తరాలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీసు స్కూల్ అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి ఎంవైకే లాటిక్రెట్ ఫౌండేషన్ రూ.2 కోట్లు మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్)లో భాగంగా విరాళంగా అందించింది. ఈ మేరకు చెక్కును ఈ సంస్థ ఎండీ మురళీ డీజీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు సాధారణ ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించడమే యంగ్ ఇండియా పోలీసు స్కూల్ లక్ష్యమని అన్నారు. ఈ స్కూల్ నిర్మాణానికి తమ వంతుగా కార్పొరేట్ సంస్ధలు అందిస్తున్న సాయం తమకు మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్ ఎం.రమేష్, పీఅండ్ ఎల్ చీఫ్ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.