బిడ్డా.. బడికెళితే ప్రాణం దక్కేదిరా
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:25 AM
బిడ్డా.. బడికెళితే బతికేవారు.. మాకు దూరమై గుండెకోత మిగిల్చారు.. అని ఆ చిన్నారుల తల్లిదండ్రు లు బోరున విలపిం చారు.
హైదరాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారుల మృతి
మర్రిగూడ, జనవరి 25,(ఆంధ్రజ్యోతి): బిడ్డా.. బడికెళితే బతికేవారు.. మాకు దూరమై గుండెకోత మిగిల్చారు.. అని ఆ చిన్నారుల తల్లిదండ్రు లు బోరున విలపిం చారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మృత్యు వాతపడిన ఐదుగురిలో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తోకల యాదయ్య, లక్ష్మమ్మ దంపతులు బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. వీరికి ప్రణీత్ (11), అఖిల్(7) కుమారులు. పదేళ్ల నుంచి నాంపల్లిలోని నాలుగో అంతస్తు భవనంలో భార్య లక్ష్మమ్మ వాచ్‌ఉమెన్‌గా, భర్త యాదయ్య అదే అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న ఓ ఫర్నిచర్ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. పిల్లలతో కలిసి భవనం సెల్లార్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగో తరగతి చదువుతున్న ప్రణీత్, రెండో తరగతి చదువుతున్న అఖిల్ ప్రతిరోజూ స్కూలుకు వెళ్తారు. శనివారం ఆసల్యం కావడంతో ఇంటి వద్దనే ఉన్నారు. శనివారం ఉదయమే తల్లిదండ్రులు పనుల నిమిత్తం స్వగ్రామం యరగండ్లపల్లికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో చిన్నారులు గదిలో నిద్రి స్తున్న క్రమంలో అపార్ట్‌మెంట్‌లో షార్ట్‌సర్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చేల రేగాయి. అప్పటికే అన్ని అంతస్తుల్లో మంటలు, దట్టమైన పొగలు చుట్టుకు న్నా యి. గదిలో ఉన్న చిన్నారులు ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలా నికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. హైదరా బాద్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి విషాదాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఇళ్లంతా సందడి చేసే చిన్నారులు ఇక లేరని, బడికి వెళితే బిడ్డలు బతికి ఉండేవాళ్లని తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు కడుపు కోత ఉండేది కాదని విలపిస్తుండడంతో వారి ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.