పరస్పర బదిలీలకు మోక్షం!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:26 AM
రెండున్నరేళ్ల క్రితం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి పెండింగులో ఉన్న ఉద్యోగుల పరస్పర బదిలీలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి సిద్ధమైన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : రెండున్నరేళ్ల క్రితం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి పెండింగులో ఉన్న ఉద్యోగుల పరస్పర బదిలీలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలు రెండేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. హైదరాబాద్‌కు దరఖాస్తు చేసుకున్న పరస్పర బదిలీలను వెంటనే పూర్తిచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీటన్నిటినీ ఒకేసారి పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పరస్పర, దంపతుల బదిలీలకు 2024 డిసెంబరులో ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొన్నేళ్లుగా వీటిని చేపట్టకపోవడంతో ఆ సమయంలో అందుకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి మూడు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. పరస్పర బదిలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో పూర్తయ్యాయి. కాగా దంపతుల బదిలీలు అన్ని శాఖల్లో పూర్తిచేసినా.. విద్యాశాఖలో మాత్రం చేపట్టలేదు. దీనిపై దరఖాస్తుదారులు అనేకసార్లు అధికారులను సంప్రదించినా స్పందించలేదు. ఈ సమస్యపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 2024 డిసెంబరులో దరఖాస్తు చేసుకుని పెండింగులో ఉన్న దరఖాస్తుదారుల వివరాలతోపాటు ఆ తర్వాత దరఖాస్తు చేసుకుని బదిలీ కోసం నిరీక్షిస్తున్నవారి వివరాలు అందించాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మహే్‌షదత్ ఎక్కా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల నేపథ్యంలో.. పెండింగ్‌లో ఉన్న దంపతుల బదిలీల వివరాలన్నీ వచ్చాక ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.