మూసీపై.. మాటల మంటలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:20 AM
మూసీ ప్రక్షాళన అంశం శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు రేపింది. బుధవారం ఈ అంశంపై సభలో వాడీవేడి చర్చ జరిగింది.
శాసనసభలో వాడీ వేడి చర్చ.. నగరాభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళన
పేదలకు అన్యాయం జరగనివ్వం: దుద్దిళ్ల
మూసీ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం ఇష్టంలేదా?: భట్టి
అంచనాలు పెంచారు: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళన అంశం శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు రేపింది. బుధవారం ఈ అంశంపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. మూసీ ప్రక్షాళన, వ్యయం, పేదల పునరావాసం, ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్న లు వేయగా.. నగరాభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనదని ప్రభుత్వం పేర్కొంది. అయితే సర్కారు వివరణతో సంతృప్తి చెందని బీఆర్‌ఎస్ సభ్యులు చివరకు సభనుంచి వాకౌట్ చేశారు. తొలుత ఆ పార్టీ సభ్యుడు కేటీఆర్ చర్చలో పాల్గొని పలు ప్రశ్నలు సంధించారు. మూసీ ప్రాజెక్టు వ్యయం రూ.లక్షన్నర కోట్లు అని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పారని, ఇప్పుడు రూ.ఆరేడు వేల కోట్లతో పూర్తవుతుందని చెబుతున్నారని, ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించి కనీసం డీపీఆర్ కూడా సిద్ధం కాకుండానే ఇళ్లను ఎలా కూలుస్తారని నిలదీశారు. డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని గతంలో చెప్పారని, ఇప్పుడు రెండు నెలల్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నుంచి రుణం మంజూరైనట్లు ప్రభుత్వం చెబుతుంటే.. ఈ నెల 11న ఏడీబీ రాసిన లేఖలో కనీసం డీపీఆర్ కూడా అందలేదని పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ సభ దృష్టి కి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. మూసీ ప్రక్షాళన కేవలం సౌందర్యం కోసం కాదని, హైదరాబాద్ భవిష్యత్తు కోసంచేస్తున్న సాహసోపేత కార్యక్రమమని అన్నారు. గతప్రభుత్వ హయాంలో మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంగా మారిందని, ఆక్రమణల వల్ల నగరం మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.
ప్రతి పైసాకూ లెక్క..
ప్రాజెక్టులో పూర్తి పారదర్శకత పాటిస్తామని, ప్రతి పైసాకూ లెక్క ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అవసరమైతే పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూసీ పునరుద్ధరణను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని స్పష్టం చేశారు. ప్రతిపక్షం కేవలం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. మెయిన్ హార్ట్ కంపెనీ డిసెంబరు 2024లో డీపీఆర్ వర్క్ మొదలుపెట్టిందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిందని వెల్లడించారు. అవసరమైతే ఆ నివేదికను సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 2016లో బఫర్ జోన్‌కు ఇరువైపులా 50 మీటర్లు ఉండాలని తెచ్చిన జీవో ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు. ఏడీబీ రుణం విషయంలో వచ్చే బోర్డు మీటింగ్‌లో స్పష్టత వస్తుందని, వాళ్లు సంతృప్తిగా లేకపోతే వేరే సంస్థ ద్వారా చేపడతామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఎస్టీపీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 80ు పనులను తాము అధికారంలోకి వచ్చాకే పూర్తిచేశామని చెప్పారు. మధ్యలో కేటీఆర్ మళ్లీ కలుగజేసుకుని మంత్రి సమాధానాలు సంతృప్తికరంగా లేవన్నారు. దీనిపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుంటూ.. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు బీఆర్‌ఎస్ సభ్యులు వచ్చి ఉండాల్సిందన్నారు. అయితే దానిని ప్రజల మధ్య నిర్వహిస్తే తాను వచ్చేవాడినని, స్టార్ హోటల్‌లో పెడితే ఎలా వస్తామని కేటీఆర్ అన్నారు.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
మూసీ ప్రక్షాళనను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అనేక జబ్బులతో బాధపడుతున్నారని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. వద్దని బీఆర్‌ఎస్ భావిస్తుందా? అని నిలదీశారు. పరివాహక ప్రాంతంలో ఉన్నవారందరికీ అపార్ట్‌మెంట్లు కడతామని ప్రభు త్వం చెప్పిందని గుర్తుచేశారు. ఎస్టీపీల్లో మురుగునీటిని శుద్ధిచేసి మూసీలో వదులుతామని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశామని తెలిపారు. ప్రతిపక్షం మంచి సలహాలు ఇవ్వొచ్చన్నారు. అయితే తాము అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమా ధానం దాటవేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెళుతూ వెళుతూ.. ఖమ్మం లోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూలగొట్టారని భట్టివిక్రమార్కపై విమర్శలు చేశారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. వెలుగుమట్ల అంశంపై చర్చ కు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ సిద్ధమా? అని సవాల్ చేశారు. ‘ఇందులో నిజాలన్నీ మీకు తెలిస్తే.. సభలో కూర్చోవడానికి కూడా మీరు సిగ్గుపడాల్సి వస్తుంది’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి తుమ్మల వ్యాఖ్యానించారు.