Share News

ఆ నదులే మాకు స్ఫూర్తి!

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:29 AM

మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలన్న తమ సంకల్పానికి ప్రపంచవ్యాప్తంగా పునరుజ్జీవం పొందిన పలు నదులే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ప్రెజెంటేషన్లో స్పష్టం చేశారు.

ఆ నదులే మాకు స్ఫూర్తి!

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్ర జ్యోతి): మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలన్న తమ సంకల్పానికి ప్రపంచవ్యాప్తంగా పునరుజ్జీవం పొందిన పలు నదులే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ప్రెజెంటేషన్లో స్పష్టం చేశారు. ఒకప్పుడు మూసీ కంటే దారుణంగా ఉన్న నదులను భారత్‌ సహా వివిధ దేశాల్లో ఎలా అభివృద్ధి చేశారో వివరించారు. ‘గ్లోబల్‌ స్ఫూర్తి’ పేరిట సియోల్‌లోని చియోన్‌గియోచిన్‌; లండన్లోని థేమ్స్‌; టోక్యోలోని సుమిద; సింగపూర్‌లోని సింగపూర్‌ రివర్‌ ఫ్రంట్‌, అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ ఫ్రంట్‌; పారిస్‌లోని సీన్‌ నదులను ప్రస్తావించారు. అప్పుడు, ఇప్పుడు అంటూ వాటిని చిత్రాలతో సహా ప్రదర్శించారు. వీటిలో చియోన్‌గియోచిన్‌ నది కేవలం 5.8 కిలోమీటర్లే. కానీ, ఇప్పుడు దీనిని ప్రతిరోజూ 50 వేల మందికిపైగా సందర్శిస్తారు. 900 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. పదేళ్లలో ఇక్కడికి 19 కోట్లకుపైగా సందర్శకులు వచ్చారు. ఇక, థేమ్స్‌ నది 39 కిలోమీటర్లు. దీనిని రోజూ 27వేల మంది సందర్శిస్తారు. 298 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ లక్షమందికిపైగా ఉపాధి అవకాశాలు లభించాయి. టోక్యోలోని సుమిదా నది 23.5 కిలోమీటర్లు. నిత్యం లక్షన్నరకుపైగా సందర్శకులు వస్తారు. 6714 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఇక్కడకు వచ్చాయి. అలాగే, సింగపూర్‌లోని రివర్‌ ఫ్రంట్‌ 3.2 కిలోమీటర్లు. నిత్యం 40 వేలకుపైగా సందర్శకులు ఇక్కడికి వస్తారు. ఏటా 2390 కోట్ల డాలర్ల ఆదాయం దీని నుంచి వస్తుంది. పారి్‌సలోని సీన్‌ నది 29 కిలోమీటర్లు. ఏటా 4 కోట్ల మంది దీనిని సందర్శిస్తారు. 74 లక్షల మంది దీనిపై ఆధారపడే బతుకుతున్నారు. ఇక, గుజరాత్‌లోని సబర్మతి ఫేజ్‌-1లో భాగంగా 11.5 కిలోమీటర్లు అభివృద్ధి చేశారు. ఇక్కడికి నిత్యం 7000 మందికిపైగా సందర్శకులు వస్తారు. ఇక్కడ 85 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించాయి. ఇదే స్ఫూర్తితో 55 కి.మీ. మూసీ నదిని మనం ఎందుకు అభివృద్ధి చేయకూడదని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు.


మూసీ పునరుజ్జీవం.. నగరానికి మేలుకొలుపు

మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్‌లో నది ప్రక్షాళన, అనంతర ప్రయోజనాలను స్లైడ్ల ద్వారా ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ నర్సింహారెడ్డి వివరించారు. కాలుష్యాన్ని తొలగించి స్వచ్ఛమైన నీటిని మూసీలో ప్రవహించేలా చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా చెప్పారు. ఇందుకు 50కిపైగా మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. 5 టీఎంసీల గోదావరి జలాలను మూసీకి మళ్లించి నిరంతరం స్వచ్ఛమైన జలాలు ప్రవహించేలా చేస్తామన్నారు. తొలిదశ మూసీ అభివృద్ధి పనుల్లో భాగంగా బాపూఘాట్‌ నుంచి జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ వరకు సుమారు 21 కి.మీ. మేర చేపట్టే అభివృద్ధి నమూనాలను వివరించారు. మూసా, ఈసా నదుల సంగమ ప్రాంతంలో గాంధీ సరోవరం ప్రాజెక్టు నిర్మాణం.. నదులు కలిసే బాపూఘాట్‌ ప్రాంతంలో ‘వి’ ఆకారంలో గాంధీ సరోవరం నిర్మిస్తున్నామని తెలిపారు. ఇది ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిపారు. నైట్‌ ఎకానమీ కోసం పరీవాహకంలో రాత్రిపూట వాణిజ్య, వినోద కార్యక్రమాల నిర్వహణ, ఉపాధి అవకాశాల గురించి వివరించారు.

Updated Date - Mar 14 , 2026 | 05:29 AM