5 కి.మీ. పనులను వెంటనే చేపట్టాలి
ABN , Publish Date - May 09 , 2026 | 05:41 AM
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 21 కిలోమీటర్లలో ఎలాంటి ఇబ్బందిలేని ఐదు కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది.
నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా మూసీ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మార్చుకోవాలి
పనులు అత్యంత పారదర్శకంగా చేపట్టాలి
ప్రజల భాగస్వామ్యంతో సాకారం చేయాలి
వచ్చే ఆగస్టులో పనులు ప్రారంభించాలి
అధికారులతో భేటీలో క్యాబినెట్ సబ్ కమిటీ
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 21 కిలోమీటర్లలో ఎలాంటి ఇబ్బందిలేని ఐదు కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఫేజ్-1 పనులు చేపట్టనున్న విషయాన్ని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కేవలం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని సబ్ కమిటీ పేర్కొంది. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదని, వా రిని భాగస్వాములను చేయడమని తెలిపింది. ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇప్పటికే ఉన్న నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా అలైన్‌మెంట్‌ను మార్చుకోవాలని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అత్యంత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. ప్రాజెక్టు పనులను అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ముం దుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధ్యక్షతన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రజల్లో ఉన్న ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి, వారిలో పూర్తిస్థాయి విశ్వసనీయత కల్పించేలా అధికారుల కార్యాచరణ ఉండాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ప్రజల ఆస్తులకు, నివాసాలకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోందని తెలిపింది. మూసీ పునరుజ్జీవం ద్వారా నగర రూపురేఖలు మారడమే కాకుండా, పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని పేర్కొంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అద్భుత ప్రాజెక్టు సాకారమవుతుందని, అభివృద్ధి, ప్రజాహితం.. రెండూ సమాంతరంగా సాగాలని అధికారులకు సూచించింది.
ఐదు దశల్లో ప్రాజెక్టు..
మూసీ ప్రాజెక్టును 5 దశల్లో 55 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. తొలిదశ పనుల కోసం రూ.7,055 కోట్లను ఏషియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి సేకరించడానికి సాంకేతిక, ఆర్థిక చర్చలు విజయవంతంగా ముగిశాయని అధికారులు.. మంత్రులకు తెలిపారు. కాగా, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమిని రక్షణ శాఖ నుంచి బదలాయించుకునే అంశంపై చర్చించారు. మూసీ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి నగరంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. బస్టాండ్లు, మెయిన్ రోడ్లపై హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు అనుసంధానమైన విభాగా ల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల అనుమతులు, విధానపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని వచ్చే ఆగస్టులో పనులను ప్రారంభించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈ బృహత్తర ప్రాజెక్టు ను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు. కాగా, ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులకు సూచించారు. సాంకేతికపరమైన అం శాలలో ఐఐటీ, జేఎన్‌టీయూల నుంచి తగిన సూచనలు తీసుకోవాలన్నారు. వర్షకాలాన్ని దృష్టిలో ఉం చుకుని నిర్మాణ పనులకు ఆటంకాలు కలగకుండా జాగ్రత్తపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రబ్బర్ డ్యాం నమూనా పరిశీలన..
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా పర్యాటక అభివృద్ధికి సంబంధించి పలు చోట్ల చెక్‌డ్యాంల తరహాలో రబ్బర్ డ్యాంలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణాల వల్ల నీటి నిల్వను పెంచి, జల క్రీడలు, బోటింగ్ సదుపాయాలు కల్పించాలన్నది ఉద్దేశం. ఒబెర్ మేయర్ స్పిల్‌వే గేట్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన రబ్బర్ డ్యాం నమూనాను ప్రజా భవన్‌లో మంత్రులు పరిశీలించారు. నాసిక్, ముంబై నగరాల్లో ఈ టెక్నాలజీ సంస్థ నిర్మించిన రబ్బర్ డ్యాంలను పరిశీలించి, తగిన అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. కాగా, మధు పార్క్ రిడ్జ్(బి-బ్లాక్) రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజాభవన్‌లో క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వ్యక్తం చేసిన సందేహాలు, అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. మధు పార్క్ రిడ్జ్ బి-బ్లాక్ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చదనం అందించేందుకే మూసీ ప్రాజెక్టును చేపట్టామని, ఆ ప్రాజెక్టులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.