Share News

మూసీ పునరుజ్జీవానికి రూ.7,345 కోట్లు

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:35 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు అమలులో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలి దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మూసీ పునరుజ్జీవానికి రూ.7,345 కోట్లు

  • తొలి దశ పనులకు పరిపాలనా అనుమతులు జారీ

హైదరాబాద్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు అమలులో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలి దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు తొలిదశలో భాగమైన జోన్‌-1ఏ, జోన్‌- 1బీ పనులను రూ.7345.12 కోట్ల(భూసేకరణ వ్యయాన్ని మినహాయించి) చేపట్టేందుకు అవసరమైన పరిపాలనా అనుమతులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.4,500 కోట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి తీసుకునే రుణంగా, మిగిలిన రూ.2845.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ సమకూర్చనున్నాయి. ఈ నిధులతో 21 కి.మీల మేర ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో జోన్‌-1ఏలో రూ.3,232.01 కోట్లతో హిమాయత్‌ సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 9.20 కి.మీల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. జోన్‌-1బీ కింద రూ.4113.11 కోట్లతో ఉస్మాన్‌ సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11.80 కి.మీల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ఈపీసీ(ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) విధానంలో చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ(పీఎంసీ) నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపచేయడమే లక్ష్యంగా సమగ్ర రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక పట్టణ మౌలిక సదుపాయాలు, సుస్థిర రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 200 చదరపు కి.మీ మేర హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు తొలి దశలో 21 కి.మీ లప్రాధాన్య మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ ప్రజలకు ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా శాస్త్రీయ ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు మొదటి దశలో భాగమైన ఉస్మాన్‌సాగర్‌, నార్సింగి ఎస్‌టీపీలను గురువారం ఆయన సందర్శించారు. పర్యావరణ సమతుల్యత, పట్టణాభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 10 , 2026 | 05:36 AM