Share News

మూసీ పునరుజ్జీవంపై నేడు చర్చ

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:11 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపైశాసనసభలో బుధవారం చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా దీనిపై చర్చ చేపట్టనున్నారు.

మూసీ పునరుజ్జీవంపై నేడు చర్చ

  • ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపట్టనున్న ప్రభుత్వం

  • సీఎం రేవంత్‌ వివరణ ఇచ్చే అవకాశం

హైదరాబాద్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపైశాసనసభలో బుధవారం చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా దీనిపై చర్చ చేపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ వివరణ కోసం అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నల్లో.. పది బుధవారం చర్చకు రానున్నాయి. వీటిలో మూసీ పునరుజ్జీవంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు కేటీఆర్‌, సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌, బండారి లక్ష్మారెడ్డి వేసిన ప్రశ్నలు మూడో అంశంగా చర్చకు రానున్నది. మున్సిపల్‌ శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రశ్నలకు స్వయంగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. బడ్జెట్‌ సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినప్పటికీ ఈ నెల 30 వరకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన అజెండాను మంగళవారం శాసనసభ ముందు ఉంచారు. దాని ప్రకారం బడ్జెట్‌ సమావేశాలు 30 వరకు కొనసాగుతాయి. మంగళ, బుధవారాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సమాధానం ఉంటాయి. గురువారం ఉగాది సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. 20న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. 21న రంజాన్‌ సెలవు. 22న ఆదివారం. 23, 24 తేదీల్లో బడ్జెట్‌పైచర్చ, సమాధానం ఉంటుంది. 25 నుంచి 29 వరకు శాఖల పద్దులపైన చర్చ, ఆమోదం ఉంటాయి. మధ్యలో 27న శ్రీరామనవమి సందర్భంగా సభకు విరామం ఇవ్వనున్నారు. 30న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం ఉంటాయి. పద్దులపై చర్చ మొదలైన తర్వాత మధ్యమధ్యలో వీలును బట్టి పలు బిల్లులకు సభ ఆమోదం తీసుకోనున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉదయం 11.30 గంటల లోపు ముగించాలని నిర్ణయించారు.

Updated Date - Mar 18 , 2026 | 05:11 AM