Share News

మూసీకి హద్దు రాళ్లు

ABN , Publish Date - May 14 , 2026 | 04:41 AM

మూసీ నది హద్దులు ఖరారవుతున్నాయి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా అధికారులు నది వెంట హద్దు రాళ్లు ఏర్పాటు చేసే పని ప్రారంభించారు.

మూసీకి హద్దు రాళ్లు

  • నది హద్దులను గుర్తిస్తూ ఏర్పాటు చేస్తున్న అధికారులు

  • గండిపేట నుంచి నార్సింగి వరకు పూర్తి

  • త్వరలోనే బాపూఘాట్‌ వరకు ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): మూసీ నది హద్దులు ఖరారవుతున్నాయి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా అధికారులు నది వెంట హద్దు రాళ్లు ఏర్పాటు చేసే పని ప్రారంభించారు. గండిపేట జలాశయం దిగువ నుంచి బాపూఘాట్‌ వరకు మూసీ నది, బఫర్‌ జోన్‌లను రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు గతంలోనే నిర్ధారించాయి. దాని ప్రకారం ‘మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్‌’ అధికారులు.. బుధవారం గండిపేట నుంచి నార్సింగి గోశాల వరకు సర్వే చేసి హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ఇటు మూసీతోపాటు అటు ఈసీ నదికి కూడా హిమాయత్‌ సాగర్‌ నుంచి రెండూ సంగమించే బాపూఘాట్‌ వరకు హద్దులు ఏర్పాటు చేయనున్నారు.

మూసీ సంరక్షణ చర్యల్లో భాగంగా..

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరం మధ్యగా ప్రవహిస్తున్న మూసీ నది భారీగా ఆక్రమణలకు గురైంది. కొన్నిచోట్ల నది తీరంలో మట్టితో పూడ్చి కాలనీలను కూడా ఏర్పాటు చేశారు. 2020 అక్టోబర్‌లో భారీ వరదతో మూసీ ఉప్పొంగడంతో చాలా కాలనీలు, తీరం వెంట ఇళ్లు నీట మునిగాయి. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన ప్రభుత్వం సర్వే చేసి నది గర్భం, బఫర్‌ జోన్‌లను మార్కింగ్‌ చేసింది. తర్వాత పూర్తిస్థాయిలో సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌ హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు, సర్వేయర్లు చేపట్టిన సుదీర్ఘ కసరత్తు ఇటీవలే పూర్తయింది. ఎఫ్‌టీఎల్‌ తర్వాత 50 మీటర్ల వరకు బఫర్‌జోన్‌గా ఖరారు చేసి, హద్దురాళ్లు పెడుతున్నారు.

Updated Date - May 14 , 2026 | 04:41 AM