Seniors Health Issues: కండలున్నా.. సత్తువ సున్నా
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:00 AM
కొందరు పెద్ద వయసువారు చూడటానికి కండపుష్టితో కనిపిస్తారు. పెద్దగా అనారోగ్య సమస్యలేమీ ఉండవు.. కానీ అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బందిపడతారు.
60 ఏళ్లు దాటినవారిలో సగం మందికి ‘డైనపీనియా’ సమస్య
చూడ్డానికి బాగానే ఉంటారు.. అడుగు తీసి అడుగు వేయలేరు
శారీరక శ్రమ లేమి, పోషకాహార లోపమే ప్రధాన కారణాలు
పురుషుల కన్నా మహిళల్లో అధికం
మైసూర్ జేఎ్‌సఎస్ మెడికల్ కాలేజీ అధ్యయనంలో వెల్లడి
నడక, శారీరక శ్రమతోనే పరిష్కారం
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కొందరు పెద్ద వయసువారు చూడటానికి కండపుష్టితో కనిపిస్తారు. పెద్దగా అనారోగ్య సమస్యలేమీ ఉండవు.. కానీ అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బందిపడతారు. కనీసం గ్లాసుడు నీళ్లను కాసేపు పట్టుకోవడానికీ అల్లాడుతారు.. దీనికి కారణం ‘డైనపీనియా’. అంటే శరీరంలో కండరాల పరిమాణం బాగానే ఉన్నా.. వాటిలో ఏ మాత్రం సత్తువ లేకుండా పోవడమే. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు వృద్ధుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అందులోనూ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన జేఎ్‌సఎస్ వైద్య కళాశాల జెరియాట్రిక్ విభాగం వైద్యుల అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2022 అక్టోబరు నుంచి 2024 ఏప్రిల్ మధ్య ఏడాదిన్నర పాటు 60ఏళ్లు దాటిన వృద్ధులపై చేసిన ఈ అధ్యయనం వివరాలు తాజాగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి.
ఏమిటీ డైనపీనియా.. సమస్య ఎంత?
సాధారణంగా వృద్ధుల్లో వయసు పెరిగినకొద్దీ కండరాల పరిమాణం తగ్గిపోయి, బలహీనం అవడాన్ని ‘సార్కోపీనియా’ అంటారు. అయితే కండరాల పరిమాణం బాగానే ఉన్నా వాటి పనితీరు పూర్తిగా తగ్గిపోవడాన్ని ‘డైనపీనియా’గా పిలుస్తారు. అంటే సదరు వ్యక్తులు పుష్టిగానే కనిపిస్తున్నా చిన్న చిన్న పనులకే ఆయాసం వచ్చేస్తుంది. కాస్త దూరం కూడా నడవలేరు. నడిచేప్పుడు పట్టుతప్పి కింద పడిపోతుంటారు. చేతుల్లో పట్టుతప్పి వస్తువులు కిందపడిపోతుంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 51.6 శాతం మంది డైనపీనియా సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సమస్యతో సతమతం అవుతున్నారని.. కొందరిలో ఈ సమస్య స్వల్పంగా ఉంటే, మరికొందరిలో చాలా తీవ్రంగా ఉంటోందని పేర్కొంది. ఇక పురుషులతో పోలిస్తే మహిళల్లో 7.6 రెట్లు ఎక్కువగా ఈ సమస్య ఉందని.. వారు చిన్నప్పటి నుంచీ సరైన పోషకాహారం లేకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, మెనోపాజ్ తర్వాత హార్మోన్ల మార్పులు వంటివి దీనికి కారణమని తేల్చింది. పేద కుటుంబాల్లోని మహిళల్లో ‘డైనపీడియా’ సమస్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది.
బరువు కాదు.. బలం ముఖ్యం
శరీరంలో కండరాల పరిమాణం కంటే వాటిలో సత్తువ ఎంత ఉందనేది ముఖ్యమని అధ్యయనం స్పష్టం చేసింది. వయసు మీద పడిన తర్వాత శారీరక శ్రమ లేకపోవడం, నడక, వ్యాయామం వంటివి చేయకపోవడంతో కండరాలు బలహీనంగా మారుతాయని... ఇక పోషకాహార లోపం కూడా ఉంటే సమస్య తీవ్రమవుతుందని పేర్కొంది. ఆరోగ్యం బాగోలేదనో, ఆయాసం వస్తోందనో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఉండటం సరికాదని.. కనీసం మెల్లమెల్లగా నడవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఇక వృద్ధులకు సంతులిత, పౌష్టికాహారం అందించాలని.. ప్రోటీన్లు అందేలా గుడ్లు, పాలు, పప్పువంటివి రోజువారీ భోజనంలో ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఈ జాగ్రత్తలు పాటిస్తే కండరాల్లో సత్తువ పెరిగి ‘డైనపీనియా’ సమస్య బారినడపకుండా ఉండొచ్చని పేర్కొంది.
సమస్యను ఇలా గుర్తించవచ్చు!
చాలా మంది ‘డైనపీనియా’తో బాధపడుతున్నా గుర్తించలేరు. చిన్న పరీక్షతో సమస్యపై అంచనాకు రావొచ్చని అధ్యయన నివేదిక వెల్లడించింది. తరచూ బరువు చూసుకున్నట్టుగానే.. నడవగలిగిన వేగాన్ని, చేతుల బలాన్ని కూడా చెక్ చేసుకోవడం మంచిదని పేర్కొంది. కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, తీవ్ర అనారోగ్యాలు లేని వృద్ధులు.. కనీసం పది సెకన్లలో 8 మీటర్ల దూరం నడవాలని, అంతకన్నా తగ్గితే ‘డైనపీనియా’ బారినపడే అవకాశం 22 రెట్లు ఎక్కువని తెలిపింది. ఇక కరచాలనం చేయడం, ఏదైనా వస్తువును పట్టుకోవడం వంటి సమయాల్లో పట్టుతప్పినట్టు అనిపిస్తే కండరాల్లో బలం తగ్గినట్టేనని పేర్కొంది. ఈ సమస్య వృద్ధులను మానసికంగానూ దెబ్బతీస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. డైనపీనియా ఉన్నవారిలో 26శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు గుర్తించామని తెలిపింది.