మూసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జి నేడే ప్రారంభం
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:03 AM
ముసారాంబాగ్-అంబర్‌పేట ప్రాంతాలను కలుపుతూ మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించనున్నారు.
ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మూసీకి 1.5లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా బ్రిడ్జి నిర్మాణం
చాదర్‌ఘాట్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ముసారాంబాగ్-అంబర్‌పేట ప్రాంతాలను కలుపుతూ మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ అధికారిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ శనివారం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆదివారం ఉదయం నుంచే ఫినిషింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు. హైలెవల్ బ్రిడ్జిని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో ముసారాంబాగ్ వద్ద ఎడమ వైపు వంతెన(డౌన్ స్ట్రీమ్) నిర్మాణం పూర్తైంది. ఈ బ్రిడ్జిపై పాదాచారులు నడిచేందుకు వీలుగా 3.5 మీటర్ల వెడల్పులో పుట్‌పాత్‌ను కూడా నిర్మిస్తున్నారు. అప్రోచ్ రోడ్డు, వీధి దీపాల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బ్రిడ్జి కుడివైపు నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కుడివైపు బ్రిడ్జిని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈలోగా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఎడమవైపు బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అనుమతించనున్నారు.
పాత బ్రిడ్జికి 10మీటర్ల ఎత్తులో నిర్మాణం
మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఇంతవరకు ఉన్న లో లెవల్ బ్రిడ్జికి 10మీటర్ల ఎత్తు(32అడుగుల)లో ఈ కొత్త హై లెవల్ బ్రిడ్జిని నిర్మించారు. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి 1.5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా కొత్తగా నిర్మించిన ఈ బ్రిడ్జి తట్టుకోవడంతో పాటు ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఉండబోదని ఇంజనీరింగ్ అధికారులు వివరిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. కాగా, బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
2023 సెప్టెంబరు 24న శంకుస్థాపన
మూసీకి వరద వచ్చినప్పుడల్లా ముసారాంబాగ్ లో లెవల్ బ్రిడ్జి మునిగిపోయేది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హై లెవల్ బ్రిడ్జిని ప్రతిపాదించింది. 2023 సెప్టెంబరు 24న శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయి. 2024, 2025 సంవత్సరాల్లో మూసీ వరద ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జి పనులకు కొంత ఆటంకం కలిగింది.