ఫిబ్రవరి 11న మునిసిపల్ పోలింగ్?
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:23 AM
మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పైఊహాగానాలు జోరందుకున్నాయి. ఈనెల 27న ఎన్నికల ప్రకటన ఉంటుందని...
ఈ నెల 27న షెడ్యూల్ విడుదల!
రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు
హైదరాబాద్, జనవరి 23(ఆంధ్ర జ్యోతి): మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పైఊహాగానాలు జోరందుకున్నాయి. ఈనెల 27న ఎన్నికల ప్రకటన ఉంటుందని, ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ దిశగా ఎన్నికల సంఘం అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అత్యధిక మునిసిపాలిటీలను గెలుచుకొనే వ్యూహాలకు పదును పెట్టాయి. రాష్ట్రంలో 116 మునిసిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 2,996 వార్డుల పరిధిలో 52,43,023 మంది ఓటర్లున్నారు. వీరిలో 26,80,014 మంది మహిళలు, 25,62,369 మంది పురుషులు, 640 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితాను అధికారులు ఇప్పటికే ప్రచురించారు. ఎస్‌ఈసీ రాణికుముదిని ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.