షెడ్యూల్‌కు నోటిఫికేషన్‌కు గ్యాప్ ఏదీ?
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:40 AM
మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య ఒక్క రోజే వ్యవధి ఉండటంపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య ఒక్క రోజే వ్యవధి ఉండటంపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం షెడ్యూల్ విడుదలైతే బుధవారమే నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. బుధవారం నుంచే మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 2020 సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించినపుడు షెడ్యూల్ ప్రకటనకు నోటిఫికేషన్‌కు మధ్య రెండు వారాల గడువు ఉంది. అప్పుడు కూడా నామినేషన్లకు మూడు రోజుల గడువే ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకటన నుంచే పార్టీలకు అభ్యర్థుల కసరత్తు మొదలు పెట్టేవి. నిజానికి రేవంత్ ప్రభుత్వం జనవరి 27 లేదా 28 తేదీల్లో నోటిఫికేషన్ ఇస్తామని ఎప్పటి నుంచో సంకేతాలు ఇస్తోంది. పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి,. మంత్రులు ఇప్పటికే జిల్లాలకు వెళ్లి అభ్యర్థుల కసరత్తు కూడా చేశారు. లాంఛనప్రాయమైన షెడ్యూల్ ప్రకటన బీఆర్‌ఎస్ హయాంలో లాగా రెండు వారాల ముందు చేయాలంటే సంక్రాంతి పండగ ముందు చేయాల్సింది. అలా కాకుండా నేరుగా నోటిఫికేషన్ ముందు రోజు చేశారు.