నేడో, రేపో మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:25 AM
మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ బుధ లేదా గురువారం వెలువడవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభించాం: మంత్రి కోమటిరెడ్డి
యాదగిరిగుట్ట/ఆలేరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ బుధ లేదా గురువారం వెలువడవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న తర్వాత, ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచే ప్రారంభించామని మంత్రి తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని దండం పెట్టి అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో మునిసిపాలిటీల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రగతిపథంలో నిలుపుతామని తెలిపారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను మునిసిపల్ ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బంగారు తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని, ప్రజలు బాగుపడింది లేదన్నారు. కాగా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలిని నియమించేందుకు సీఎంరేవంత్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారు.