Share News

Minister Damodara Rajanarsimha: రాష్ట్రవ్యాప్తంగా ఐకేర్‌ క్లినిక్స్‌

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:57 AM

రాష్ట్రవ్యాప్తంగా డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్ల తరహాలో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐకేర్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు....

Minister Damodara Rajanarsimha: రాష్ట్రవ్యాప్తంగా ఐకేర్‌ క్లినిక్స్‌

  • అన్ని వర్గాల వారికి అందుబాటులో కంటి వైద్య సేవలు: మంత్రి దామోదర

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్ల తరహాలో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐకేర్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. శనివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వంటేరి యాదవరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇటీవల ప్రారంభించిన డేకేర్‌ క్యాన్సర్‌ క్లినిక్స్‌లో కేన్సర్‌ స్ర్కీనింగ్‌, డయాగ్నసిస్‌, కీమోఽథెరపీ తదితర సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో అన్ని వర్గాలకు కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు ఐకేర్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక నిమ్స్‌లో వైద్యుల కొరతపై తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మధుసూదనాచారి, బండా ప్రకాశ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి దామోదర బదులిస్తూ.. నిమ్స్‌ వైద్యసేవలను విస్తరించనున్నామని, వైద్యులకు ప్రోత్సహకాలు అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా బుద్ధవనం: మంత్రి జూపల్లి

నాగార్జునసాగర్‌ సమీపంలో 271 ఎకరాల్లో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ ప్రతిష్ఠాత్మక బౌద్ధ వారసత్వ, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేతావత్‌ శంకర్‌ నాయక్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. నల్లగొండ జిల్లా వాడపల్లి కృష్ణా-మూసీ నదుల సంగమ క్షేత్రంలో వీరనారాయణ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

రాజధాని నలువైపులా అభివృద్ధి: దుద్దిళ్ల

హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఐటీ టవర్‌ నిర్మాణ ప్రగతిపై ఏవీఎన్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయని, మళ్లీ టెండర్లు పిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇదే అంశశంపైఐ దాసోజు శ్రవణ్‌, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. కరీంనగర్‌, నల్లగొండ తదితర ప్రాంతాల్లో నిర్మించిన ఐటీ టవర్లు చాలా వరకు ఉపయోగంలోకి రాలేదని, వచ్చినా కొంత కాలానికే పరిమితం అవుతున్నాయని చెప్పారు. అధిక శాతం మంది హైదరాబాద్‌పై దృష్టి సారించడమే దీనికి కారణమన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు నిబంధనలు సవరించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు సవరించాలని శాసనమండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం ప్రత్యేక ప్రస్తావనలో సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం కోరారు. ఆటో, ట్రాక్టర్‌ ఉన్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయడం లేదని చెప్పారు. కాగా, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ సభ్యురాలు వాణిదేవి, ఆటో కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని తీన్మార్‌ మల్లన్న కోరారు. వివిధ అంశాలపై పలువురు ఎమ్మెల్సీలు విజ్ఞప్తులు చేశారు. కాగా, రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించడంతో.. బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ నినాదాలు చేశారు.

Updated Date - Jan 04 , 2026 | 04:57 AM