Share News

మధుమేహులకు బైపాస్‌‌లో బహుళ ధమనుల వాడకమే సురక్షితం

ABN , Publish Date - May 15 , 2026 | 04:27 AM

మధుమేహంతో పాటు గుండె వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ (సీఏ-బీజీ) శస్త్రచికిత్సలో ఒక ధమని...

మధుమేహులకు బైపాస్‌‌లో బహుళ ధమనుల వాడకమే సురక్షితం

  • హృద్రోగ నిపుణుడు లోకేశ్వర్‌ సజ్జా అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

హైదరాబాద్‌ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): మధుమేహంతో పాటు గుండె వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ (సీఏ-బీజీ) శస్త్రచికిత్సలో ఒక ధమని (సింగిల్‌ ఆర్టీరియల్‌ గ్రాఫ్ట్‌-ఎస్ఏజీ) కంటే బహుళ ధమనులను (మల్టిఫుల్‌ ఆర్టీరియల్‌ గ్రాఫ్ట్‌లు-ఎంఏజీ) ఉపయోగించడమే సురక్షితమని తాజా అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకుముందు ఎంఏజీ చికిత్స వల్ల ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనే అపోహ ఉండేదని.. అది సరికాదని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనానికి హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ ఆస్పత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ లోకేశ్వరరావు సజ్జా నేతృత్వం వహించారు. ఇటీవల అమెరికాలోని షికాగోలో జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ థొరాసిక్‌ సర్జరీ వార్షిక సదస్సులో ఈ అధ్యయన వివరాలను ప్రకటించారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిధులతో కొనసాగుతున్న ఈ అధ్యయనం పూర్తి స్థాయి దీర్ఘకాలిక ఫలితాల కోసం ఇంకా కొనసాగిస్తున్నారు. దేశంలో 7 రాష్ట్రాల్లోని 15 ఆస్పత్రుల్లో 2022 ఫిబ్రవరి నుంచి 2025 జనవరి వరకు మొత్తం 950 మంది మధుమేహ రోగులపై ఈ అధ్యయనం చేసినట్లు డాక్టర్‌ లోకేశ్వరరావు తెలిపారు. వీరిలో 477 మందికి ఎస్‌ఏజీ, 473 మందికి ఎంఏజీ పద్ధతుల్లో సీఏబీజీ శస్త్రచికిత్స చేసినట్లు వెల్లడించారు. ఇందులో మొదటి ఏడాది ఫలితాల మేరకు సాధారణ ఎస్‌ఏజీ కంటే మధుమేహులకు ఎంఏజీ చేయడమే సురక్షితమని.. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఇది దీర్ఘకాలిక రక్షణను కూడా అందిస్తుందని గుర్తించినట్లు తెలిపారు. ‘భారతీయుల్లో గుండెపోటుకు దారితీసే వ్యాధులు 15ఏళ్ల ముందే వస్తున్నాయి. మధుమేహ రోగులూ ఎక్కువగా ఉన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఐదేళ్ల అధ్యయనం చేపట్టాం.. మొదటి ఏడాది ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. రాబోయే నాలుగేళ్ల పరిశోధనలో వెలువడే మరిన్ని ఫలితాల ఆధారంగా మెరుగైన బైపాస్‌ సర్జరీ విధానాలను రూపొందించవచ్చు’ అని లోకేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - May 15 , 2026 | 04:27 AM