మోదీ మెచ్చిన ముదిగుంట
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:55 AM
ముదిగుంట.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం. ఈ ఊరు ఇటీవల ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది.
జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచిన మంచిర్యాల జిల్లాలోని గ్రామం
తాజాగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించిన ప్రధాని
మంచిర్యాల, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ముదిగుంట.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం. ఈ ఊరు ఇటీవల ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది. ఇందుకు కారణం జల సంరక్షణలో ఈ గ్రామం దేశానికి ఆదర్శంగా నిలువడమే. గత ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ.. ముదిగుంటలోని ఇళ్లలో ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలమట్టం పెరిగిందని, ఇది నిజమైన ప్రజా ఉద్యమమంటూ కొనియాడారు. 1571 జనాభా ఉన్న ఈ ఊరిలో 400 ఇళ్లున్నాయి. ఇప్పటి వరకు 300ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తికాగా మిగిలిన వాటి నిర్మాణం తుది దశలో ఉంది. ముదిగుంటలో గతంలో 70 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉండేవి. దీంతో నీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకుగాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా సంబంధిత అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. డీఆర్డీఏ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు.. మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఇంకుడు గుంతలు నిర్మించేలా గ్రామస్థులను ప్రోత్సహించారు. ఇంకుడు గుంతలే కాకుండా గ్రామ శివారులో నాలుగు చెక్ డ్యామ్‌లు నిర్మించడంతోపాటు ఇళ్లలో రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టడంతో గ్రామంలో భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యల ఫలితంగా ఏడెనిమిదేళ్ల క్రితంతో పోల్చితే గ్రామంలో భూగర్భ జలాల లభ్యత పెరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం 30 అడుగుల లోతులోనే నీరు లభిస్తోందని అధికారులు అంటున్నారు. ఈ పల్లెను ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన ద్వారా మూడు కుంటలను అభివృద్ధి చేశారు. వీటి నీటితో అడవిలో మూగజీవాల దాహం తీరుతోంది. ప్రధాని ప్రశంసలు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ముదిగుంట సర్పంచ్ రవి పేర్కొన్నారు. తమ గ్రామం పేరు ప్రధాని నోట వినడం సంతోషంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.