Share News

చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్‌ కన్నుమూత

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:26 AM

ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తిగా గుర్తింపు పొందిన ముదిగొండ శివప్రసాద్‌ (86) కన్నుమూశారు.

చారిత్రక నవలా చక్రవర్తి   ముదిగొండ శివప్రసాద్‌ కన్నుమూత
sivaprasad

చారిత్రక నవలా చక్రవర్తి

ముదిగొండ శివప్రసాద్‌ కన్నుమూత

గ్రీకు భాషా సాహిత్యంపై విశేష పరిశోధన.. ఓరుగల్లు ప్రాంత చరిత్రపైనా పుస్తకాలు

ఉస్మానియా తెలుగు ఆచార్యుడిగా సేవలు

పలువురు కవులు, రచయితల సంతాపం నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పురా, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తిగా గుర్తింపు పొందిన ముదిగొండ శివప్రసాద్‌ (86) కన్నుమూశారు. ఆయనకు గురువారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు విద్యానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగా మరోసారి గుండెపోటు రావడంతో రాత్రి 8.49 గంటలకు తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్‌ ఏపీలోని ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలో 1940 డిసెంబరు 23న జన్మించారు. తమ పూర్వీకులు కశ్మీరు నుంచి వచ్చి ఓరుగల్లు కాకతీయుల రాజ్యం రాణి రుద్రమ కొలువులో రాజ గురువులుగా స్థిరపడ్డారని ఆయన రాశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఉస్మానియా వర్సిటీలో ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి రచనల ప్రభావంతో నవలా రచన ప్రారంభించారు. ఓయూ తెలుగు శాఖలో 1970లో అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టి.. 2000లో ఉద్యోగ విరమణ చేశారు. ప్రాచీన గ్రీకు సాహిత్యం, నాటకాలు, తత్వశాస్త్రంపై లోతైన పరిశోధన చేసి.. ప్రామాణిక గ్రంథాలు రాశారు. అమరావతి చరిత్ర నేపథ్యంలో ఆరు నవలలు రాశారు. క్రైస్తవంపైనా అధ్యయనం చేసిన ముదిగొండ శివప్రసాద్‌.. కైస్త్రవ అష్టకం పేరుతో 8 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన కాకతీయ కళాదర్శనం, ముసునూరి చక్రవర్తులపై తొలి చారిత్రక నవల అమృతోదయం, పాకాల చెరువు కథలు, విజ్ఞాన విపంచి వ్యాస సంపుటి తదితర 136 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇక ఆయ న కృష్ణా పత్రిక సంపాదక వర్గం లో ముఖ్య పాత్ర పోషించారు. భారతీయ సాహిత్య పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, సింగపూర్‌, దుబారులలో కీలకోపన్యాసాలు చేశారు. కుర్తాళం పీఠాధిపతి సారథ్యంలో కనకాభిషేకం, స్వర్ణకంకణ బహూకరణ వంటి ప్రత్యేక గౌరవాలు, ఉమ్మడి ఏపీ నుంచి ఉగాది పురస్కారం వంటి అవార్డులు ఎన్నో శివప్రసాద్‌ అందుకున్నారు. శివప్రసాద్‌ రచనలపై ఉస్మానియా, నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయ తదితర వర్సిటీల్లో పలువురు పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకోవడం గమనార్హం. శివప్రసాద్‌ భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం 11 గంటల వరకు సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలోని స్వగృహంలో బంధు, మిత్రుల సందర్శనార్థం ఉంచుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - Oct 09 , 2026 | 04:27 AM