Share News

సాంకేతికతను అభివృద్ధి కోసం తప్ప వినాశనం కోసం వినియోగించొద్దు: ఈటల

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:27 AM

సాంకేతికతను అభివృద్ధి కోసం తప్ప వినాశనానికి వినియోగించవద్దని, కానీ ఇప్పుడు వినాశనానికి వాడుతున్న తీరు ఆందోళనకరమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

సాంకేతికతను అభివృద్ధి కోసం తప్ప వినాశనం కోసం వినియోగించొద్దు: ఈటల

హైదరాబాద్‌ సిటీ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): సాంకేతికతను అభివృద్ధి కోసం తప్ప వినాశనానికి వినియోగించవద్దని, కానీ ఇప్పుడు వినాశనానికి వాడుతున్న తీరు ఆందోళనకరమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఐఐటీయన్లు చేసే పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రజల ఆకలి తీర్చేలా ఉండాలి తప్ప వినాశనానికి కారణం కాకూడదని అభిప్రాయపడ్డారు. భారత శాస్త్ర సాంకేతికత నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, ఆ నైపుణ్యాన్ని మన దేశాభివృద్ధికి వినియోగించాలని కోరారు. దేశవ్యాప్తంగా పలు ఐఐటీల పూర్వ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాన్‌ ఐఐటీ ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన పాన్‌ ఐఐటీ హైదరాబాద్‌ సమ్మిట్‌-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే అయినప్పటికీ.. దేశంలో ఇంకా 80 కోట్ల మందికి బియ్యం పంపిణీ జరుగుతున్నదని లెక్కలు చెబుతున్నాయన్నారు. దారిద్య్ర రేఖకుపైన 25 కోట్ల మంది వరకు వచ్చారని చెబుతున్నప్పటికీ సంక్షేమ పథకాలు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ప్రజలు వారి కాళ్ల మీద వారు నిలబడే శక్తిని అందించేలా ప్రభుత్వ పథకాలు ఉండాలి తప్ప, సాయం కోసం సర్కార్‌ వైపు చూసేలా ఉండకూడదని, ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు.

Updated Date - Mar 09 , 2026 | 04:27 AM