Share News

సిట్‌ విచారణను పక్కదారి పట్టించేందుకే నైనీ అంశం తెరపైకి

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:23 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణను పక్కదారి పట్టించేందుకే నైనీ బొగ్గు బ్లాకుల అంశాన్ని హరీశ్‌రావు, కేటీఆర్‌లు తెరపైకి తెచ్చారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు

సిట్‌ విచారణను పక్కదారి పట్టించేందుకే నైనీ అంశం తెరపైకి

  • కేటీఆర్‌, హరీశ్‌రావులపై చామల ధ్వజం

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణను పక్కదారి పట్టించేందుకే నైనీ బొగ్గు బ్లాకుల అంశాన్ని హరీశ్‌రావు, కేటీఆర్‌లు తెరపైకి తెచ్చారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ బొగ్గు బ్లాకుల టెండర్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో టెండర్లను ఎందుకు రద్దు చేసిందీ ఆయన చెప్పారని పేర్కొన్నారు. టెండర్‌ నిబంధనల్లో సైట్‌ విజిటింగ్‌ ప్రక్రియ అనేది సాధారణమేనని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాకున్నా సీఎం రేవంత్‌రెడ్డి తన బావమరిదికి టెండర్‌ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణిపై కేటీఆర్‌, హరీశ్‌రావులు చెప్పే మాటలు బూటకమని కిషన్‌రెడ్డి మాటలతో తేలిపోయిందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌, హరీశ్‌రావులు జైలుకెళ్లి ఊచలు లెక్కించడం ఖాయమని మానకొండూరు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియ కల్వకుంట్ల కుటుంబమని, లబ్ధిదారులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ చచ్చిన పాము అని, దాన్ని చూసి భయపడేదిలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, జిల్లాల మార్పు అనేది బీఆర్‌ఎస్‌ సృష్టి అని, మునిసిపల్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం కేటీఆర్‌, హరీశ్‌రావు లేని అంశాలను తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ఆరోపించారు. బొగ్గు స్కామ్‌ పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 04:23 AM