Share News

రూ. 2వందల కోట్ల స్థలాన్ని.. 10 కోట్లకే ఇవ్వాలని ఎంపీ బెదిరింపులు..!

ABN , Publish Date - May 25 , 2026 | 05:39 AM

రూ.200 కోట్ల స్థలాన్ని రూ.10 కోట్లకే ఇవ్వాలని ఓ ఎంపీ బెదిరిస్తున్నారని అనన్యా ఇన్ర్ఫా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు నితీష్‌ విజయ్‌ వర్గియా, అశోక్‌ రెడ్డి ఆరోపించారు.

రూ. 2వందల కోట్ల స్థలాన్ని.. 10 కోట్లకే ఇవ్వాలని ఎంపీ బెదిరింపులు..!

హైటెక్‌సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): రూ.200 కోట్ల స్థలాన్ని రూ.10 కోట్లకే ఇవ్వాలని ఓ ఎంపీ బెదిరిస్తున్నారని అనన్యా ఇన్ర్ఫా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు నితీష్‌ విజయ్‌ వర్గియా, అశోక్‌ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం సర్వే నంబర్లు 93,94,95,97,98,99లలో 33 ఎకరాల 25 గుంటల స్థలం ఉందన్నారు. ఆ భూమి హక్కుదారులు దివాలా తీశారని, దాంతో ఆ సంస్థతో అగ్రిమెంట్‌ చేసుకున్న వారంతా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారన్నారు. 2018 నుంచి 2023 వరకు దానిపై కేసు నడిచిందని పేర్కొన్నారు. అగ్రిమెంట్‌ చేసుకున్న వారికి పాత యాజమాన్యం డబ్బు చెల్లించనందున 2023లో ఎన్సీఎల్టీ కోర్టు వేలం వేయడంతో ఆ స్థలాన్ని తాము దక్కించుకున్నామన్నారు. అయితే ఈ 34 ఎకరాల భూమిపై ఓ ఎంపీ కన్ను పడిందని.. రూ.10 కోట్లు తీసుకుని వెళ్లిపోవాలంటూ తమను బెదిరిస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్‌, ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లినా వారు ఎంపీకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మ్యుటేషన్‌ కోసం మూడేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. సీసీఎస్‌ పోలీసులు తమను పోలీసు స్టేషన్‌కు పిలిచి ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి ఎంపీ చెప్పినట్టు చేయాలంటూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.

Updated Date - May 25 , 2026 | 05:39 AM