మోతుకుపల్లి, పసల్వాడి గ్రామాలకు సతత్ వికాస్ పురస్కారాలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:06 AM
గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ఠ ప్రతిభ కనబరుస్తూ తెలంగాణలోని పంచాయతీలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన దీన్‌దయాళ్..
అభినందించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ఠ ప్రతిభ కనబరుస్తూ తెలంగాణలోని పంచాయతీలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు రాష్ట్రంలోని రెండు పంచాయతీలకు దక్కాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలంలోని మోతుకుపల్లి గ్రామ పంచాయతీకి ‘గుడ్ గవర్నెన్స్’ విభాగంలో అవార్డు దక్కింది. గ్రామంలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు దక్కింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని పసల్వాడి గ్రామ పంచాయతీ ‘విమెన్ ఫ్రెండీ’్ల పంచాయతీ విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికైంది. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన కృషికి గాను ఈ గుర్తింపు దక్కింది. తెలంగాణకు ఈ అవార్డులు రావడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోతుకుపల్లి, పసల్వాడి గ్రామ పంచాయతీ అధికారులను మంత్రి అభినందించారు.
వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు
వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగాలు వెల్లడించాయి. 15 రోజుల పాటు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ బుధవారం ప్రారంభమైందని, రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన నీటి సరఫరా వివరాలను ప్రతిరోజు మంత్రితో పాటు ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు తెలిపాయి.