వాహనదారుల కష్టాలు డబుల్
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:47 AM
: హుజూర్‌నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచేపల్లి వరకు రెండులేన్లతో నిర్మించిన అంతర్‌రాష్ట్ర రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు
ఇరుకుగా హుజూర్‌నగర్- దాచేపల్లి డబుల్ రోడ్డు
నిత్యం వందలాది వాహనాల రాకపోకలు
నాలుగు లేన్లుగా మార్చాలని ప్రయాణికుల విజ్ఞప్తి
మఠంపల్లి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): హుజూర్‌నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచేపల్లి వరకు రెండులేన్లతో నిర్మించిన అంతర్‌రాష్ట్ర రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డు గుండా నిత్యం వందలాది వాహనాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతు న్నారు. నార్కట్‌పల్లి నుంచి ఏపీలోని మేదరమట్ల నాలుగు లేన్లకు అనుసంధానంగా వేసిన ఈ డబుల్ రోడ్డులో భాగంగా మఠంపల్లి మండలం మట్టపల్లి రెండు తెలుగు రాష్ట్రాలకు వారథిగా కృష్ణానదిపై రూ.50కోట్లతో హైలెవల్ వంతెన నిర్మించారు. దీంతో ఇప్పటికే తెలంగాణ వైపు ఉన్న కృష్ణపట్టె ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉండడంతో నిత్యం వందలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా మారింది.
రోడ్డును విస్తరిస్తే ప్రయాణం సుగమం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పత్తి, మిరప పంటల వాణిజ్య వ్యాపార సంబంధాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. దీంతో వాహనాల రద్దీ ఏర్పడి తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో దాచేపల్లి, తంగేడ, పెదవీడు, మఠంపల్లి, బక్కమంతులగూడెం తదితర గ్రామాలకు చెందిన వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం హుజూర్‌నగర్ నుంచి మట్టపల్లి మహాక్షేత్రం వరకు గల 25కిలో మీటర్ల రోడ్డును ఫోర్ లేనుగా మార్చితే పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల రద్దీని తట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి మట్టపల్లి కృష్ణానదీపై నిర్మించిన హైలెవల్ వంతెన నుంచి కేవలం 15కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ రాష్ట్రంలోని దాచేపల్లి వరకు నాలుగు లేన్లుగా అనుసంధానంగా విస్తరించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
ప్రభుత్వాలు దృష్టి సారించాలి
హుజూరణగర్ నుంచి మఠంపల్లి మీదగా ఆంధ్రా- తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ నిత్యం రద్దీగా ఉండే అంతరాష్ట్ర రహదారిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు దృష్టి సారించాలి. మట్టపల్లి కృష్ణానదిపై వంతెన ప్రారంభంతో మఠంపల్లి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింద. వాహనాలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి.
- భూక్య కొండానాయక్, మఠంపల్లి.
నాలుగు లేన్లుగా మార్చాలి
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై మట్టపల్లి వద్ద నిర్మించిన వంతెనతో రాకపోకలు భారీగా పెరిగి డబుల్ రోడ్డుపై ప్ర మాదాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పం దించి నాలుగు లేన్లుగా రోడ్డును మార్చేందుకు చర్యలు తీసుకోవాలి.
- బానోతు నాగేశ్వరావు, మఠంపల్లి