Share News

రాజ్యాధికారం కోసం మాదిగలు సంఘటితం కావాలి

ABN , Publish Date - Feb 15 , 2026 | 06:37 AM

రాజ్యాధికారం కోసం మాదిగలు అంతా సంఘటితమవ్వాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు.

రాజ్యాధికారం కోసం మాదిగలు సంఘటితం కావాలి

  • ఎంఐఎం తరహాలో ప్రభుత్వాలు, పార్టీలను శాసించాలి: మోత్కుపల్లి నర్సింహులు

సుభాష్ నగర్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాజ్యాధికారం కోసం మాదిగలు అంతా సంఘటితమవ్వాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. మాదిగ మేధావుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి రాజేందర్‌ అధ్యక్షతన కరీంనగర్‌లో శనివారం జరిగిన మాదిగ మహాశక్తి ఆత్మీయ సదస్సులో మోత్కుపల్లి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ శాసిస్తున్నారని అన్నారు. 12 శాతం జనాభా ఉన్న మాదిగలు కూడా ఎంఐఎం తరహాలోనే ప్రభుత్వాలు, పార్టీలను శాసించాల్సిన అవసరముందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 50వేల వరకు ఉన్న ఎస్సీలంతా గంపగుత్తగా ఎస్సీ అభ్యర్థులకే ఓట్లు వేసే స్థితిరావాలన్నారు. మాదిగ దండోరా ఉద్యమంలో ఎంతమంది మాదిగలు అమరులయ్యారని, ఎస్సీ వర్గీకరణలో వారి పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. అమరుల స్థూపం, కోటి రూపాయలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, అలాగే, అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. అనంతరం టీపీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తూ వారికే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. మాదిగలంతా ఏకం కావాలని వరంగల్‌ మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 06:38 AM