కర్ల రాజేశ్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:35 AM
సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల వ్యవహారంలో రిమాండ్‌లో ఉండగా మృతి చెందిన కర్ల రాజేశ్ తల్లికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో గురువారంఆర్డీవో సూర్యనారాయణ...
సీఎంఆర్‌ఎఫ్ అక్రమాల కేసులో రిమాండ్‌లో ఉన్న రాజేశ్‌కు అస్వస్థత.. గత ఏడాది నవంబరులో మృతి
బాధ్యులపై చర్య తీసుకోవాలని పెద్దఎత్తున ఆందోళన
తాజాగా అతడి తల్లికి ఉద్యోగ నియామక పత్రం అందజేత
కోదాడటౌన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల వ్యవహారంలో రిమాండ్‌లో ఉండగా మృతి చెందిన కర్ల రాజేశ్ తల్లికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో గురువారంఆర్డీవో సూర్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి తదితరులు రాజేశ్ తల్లి లలితమ్మకు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్‌లో లలితమ్మకు ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపారు. వాస్తవానికి సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల వ్యవహారంలో కోదాడకు చెందిన కర్ల రాజేశ్(33)పై చిలుకూరు పోలీ్‌సస్టేషన్‌లో 2025 నవంబరు 4న కేసు నమోదైంది. అదే నెల 10వ తేదీన రాజేశ్‌ను హుజూర్‌నగర్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. హుజూర్‌నగర్ సబ్ జైలులో ఉన్న రాజేష్ 15వ తేదీన అస్వస్థతకు గురి కావడంతో జైలు సిబ్బంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ 16వ తేదీ తెల్లవారుజామున రాజేశ్ మృతి చెందారు. పోలీసులు కొట్టడం వల్లే రాజేశ్ అస్వస్థతకు గురై మృతి చెందాడని ఆరోపిస్తూ.. అతడి బంధువులు ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చివరకు మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని అధికారులతోపాటు ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల రాజేశ్ తల్లికి ఇందిరమ్మ ఇంటి స్థలం కేటాయింపు పత్రాన్ని కలెక్టర్ అందజేశారు.