మదర్ డెయిరీని ఎన్‌డీడీబీకి అప్పగించాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:26 AM
అప్పుల్లో కూరుకుపోయిన నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ (నార్ముల్-మదర్ డెయిరీ)ను వృద్ధిలోకి తీసుకువచ్చే బాధ్యతను జాతీయ పాడి ...
సీఎం రేవంత్‌కు డెయిరీ పాలక వర్గం విజ్ఞప్తి
హైదరాబాద్, హయత్‌నగర్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అప్పుల్లో కూరుకుపోయిన నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ (నార్ముల్-మదర్ డెయిరీ)ను వృద్ధిలోకి తీసుకువచ్చే బాధ్యతను జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ)కు అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి డెయిరీ పాలక వర్గం, స్థానిక ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఎన్‌డీడీబీ కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేసి డెయిరీని వృద్ధిలోకి తెస్తుందని వారు వివరించారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు కలిశారు. ప్రస్తుతం డెయిరీ తీవ్ర నష్టాలు, సమస్యలను ఎదుర్కొంటోందని, దీనిని ఎన్‌డీడీబీకి అప్పగించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎంను కోరారు. మదర్ డెయిరీని ఎన్‌డీడీబీకి అప్పగించేందుకు ఎన్‌వోసీ ఇప్పించాలని పాలకవర్గ సభ్యులు విన్నవించారు. వారి వినతిని సావధానంగా విన్న ముఖ్యమంత్రి.. డెయిరీ సమస్యల గురించి మంత్రి వాకిటి శ్రీహరి, శాఖ అధికారులతో భేటీ అయి సమగ్రంగా చర్చించాలని సూచించారు. బుధవారం సీఎం రేవంత్ మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడే అవకాశం ఉందని మధుసూదన్ రెడ్డి తెలిపారు.